భారీ సినిమాలకు భారీ ఫంక్షన్లు. నిజానికి ఇవి అవసరం లేదు. కానీ అది ఓ ప్రోటోకాల్ మాదిరిగా తయారయింది వ్యవహారం. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఇప్పుడు భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు చేయకపోయినా ఓపెనింగ్స్ కు ఢోకా వుండదు. కేవలం ఫ్యాన్స్ ను ఉత్సాహపర్చడం కోసం తప్ప మరెందుకు కూ కాదు ఈ ఫంక్షన్లు. దీని కోసం లక్షలకు లక్షలు ఖర్చు. హైదరాబాద్ లో ఈ ఫంక్షన్లు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు భారీగా ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కొన్ని ఫంక్షన్ హాల్స్ లో మాత్రమీ వీటిని చేస్తున్నారు. బహిరంగంగా చేయడం తగ్గిపోయింది. కావాలంటే వరంగల్ వెళ్తున్నారు..ఖమ్మం వెళ్తున్నారు.
ఆంధ్రలో కూడా కర్నూలు, విశాఖ, ఇలా పలు చోట్ల చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ప్లాన్ చేసారు ఒంగోలులో, అలాగే విశాఖలో. వీటికి ఇప్పుడు అనుమతులు రావడం లేదు. ఊరికి దూరంగా మైదానంలో చేసుకోమంటున్నారు పోలీసులు. ఎక్కడ చేసినా ఫ్యాన్స్ రావడం పక్కా. అక్కడ ఏమీ తేడా వుండదు.
కానీ డిజటల్ యుగం ఇది. ట్రెండ్ లు మారుతున్నాయి. సినిమాల మీద ఈ ఫంక్షన్ల భారం కూడా తగ్గాలి. ట్విట్టర్ లో, ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో సెలబ్రిటీలు మాట్లాడుతూనే వున్నారు. సమాధానాలు ఇస్తూనే వున్నారు. పబ్లిసిటీ కంటెంట్ అంతా ఆన్ లైన్ లో వదలుతూనే వున్నారు. మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అన్ని విధాలా సినిమాకు బజ్, హైప్ తీసుకురావడానికి డిజిటల్ మాధ్యమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఈ భారీ ఫంక్షన్లు ఇంకా అవసరమా? ఎంత ఖర్చు. ఎంత కాలం వృధా. కేవలం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడానికి తప్ప సినిమాకు ఏ మేరకు ఉపయోగం? చిన్న సినిమాల సంగతి వేరే. సంక్రాంతి భారీ సినిమాలకు ఇవి ఏ మేరకు అవసరం అన్నది ఆలోచించాలి.