కుప్పంలో చంద్రబాబు పర్యటన క్షణక్షణానికి ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఒకవైపు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు. బెంగళూరుకి విమానంలో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టనున్నారు.
షెడ్యూల్ ప్రకారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి 2 గంటలకు చంద్రబాబు చేరుకోవాల్సి వుంది. బాబు కోసం కుప్పం నుంచి తెలుగుదేశం ప్రచార రథంతో పాటు మరికొన్ని వాహనాలు అక్కడికి వెళ్లేందుకు బయల్దేరాయి. వీటిని పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ ప్రచార రథంతో పాటు సౌండ్ సిస్టం ఉన్న వాహనాన్ని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే వాహనాల డ్రైవర్లు, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సాయంత్రం కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజ్‌ను కూడా పోలీసులు తొలగించారు.
చంద్రబాబు పర్యటనకు అనుమతి లేకపోవడంతో ఆయన్ను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం గమనార్హం. బాబు పర్యటనకు వెళుతున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో గంటన్నరలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అడుగు పెట్టనున్నారు. బాబు పర్యటనను సజావుగా సాగనిస్తారా? లేకపోతే ఏమవుతుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి వుంది.
పోలీసుల అడ్డగింతను లెక్క చేయకుండా చంద్రబాబు పర్యటనను కొనసాగిస్తే మాత్రం… వైసీపీకి భారీ షాక్ అని చెప్పక తప్పదు. టీడీపీలో పెద్ద ఎత్తున మానసిక స్థైర్యం పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. కుప్పం నుంచే వైసీపీపై ధిక్కార శంఖారావాన్ని పూరించి, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై నైతిక విజయం సాధించినట్టు అవుతుంది. అందుకే కుప్పంలో ఇప్పుడు ప్రతి క్షణం విలువైందో. కుప్పంలో బాబు పర్యటన అన్‌స్టాపబుల్ కాంట్రవర్సీ గా తయారైంది. ఏం జరగనుందో చూద్దాం.
Tdp party elections ki mundhu 2024. Condom packets medha kuda tdp party symbol vesaru