ఐదేళ్ల కిందటి కథ ఇప్పుడు ఓకేనా?

కరోనాకు ముందు, కరోనా తర్వాత టాలీవుడ్ పూర్తిగా మారిపోయింది. థియేట్రికల్ వ్యవస్థలోనే కాదు, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ మోస్తరు సినిమా థియేటర్లలో ఆడడం లేదు. ఒకప్పట్లా యావరేజ్ అనే…

కరోనాకు ముందు, కరోనా తర్వాత టాలీవుడ్ పూర్తిగా మారిపోయింది. థియేట్రికల్ వ్యవస్థలోనే కాదు, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ మోస్తరు సినిమా థియేటర్లలో ఆడడం లేదు. ఒకప్పట్లా యావరేజ్ అనే టాక్ లేదిప్పుడు. సమీక్షకులు మొహమాటానికి యావరేజ్ అని చెప్పినా, ప్రేక్షకులు మాత్రం ఎలాంటి మొహమాటాలకు పోవడం లేదు. హిట్ అయితే థియేటర్లలో ఆడుతుంది, లేదంటే ఫ్లాప్ అవుతుంది. ఈ రెండు మాత్రమే మిగిలాయిప్పుడు.

ఇలాంటి టైమ్ లో ఐదేళ్ల కిందటి కథతో వస్తోంది ఓ సినిమా. అదే ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే శౌర్య కెరీర్ లో ఆగిపోయిన సినిమాలున్నాయి కానీ, ఇంత ఆలస్యమైన సినిమాలు మాత్రం లేవు. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఇక్కడ సమస్య ఒక్కటే. కరోనాకు ముందు అనుకున్న కథ ఇది. అప్పటిక కథ ఇప్పటి ప్రేక్షకులకు ఎక్కుతుందా అనేది ఓ అంశమైతే.. కరోనా తర్వాత మారిన ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందా అనేది మరో అంశం.

ఏదేమైనా చేసేదేం లేదు. ప్రచారం చేసి సినిమాను విడుదల చేయాల్సిందే. పీపుల్ మీడియా అదే పని చేస్తోంది. అయితే ప్రస్తుతం వీళ్లకు మంచి రోజులు నడుస్తున్నాయి. వరుసగా హిట్స్ ఇస్తున్నారు. ఈ ఫ్లోలో ఈ సినిమా కూడా ఆడేస్తుందేమో!