నాలుగు సినిమాలు చేతిలో వున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు. అయితే ఇవి ఎప్పటికి పూర్తవుతాయి అన్నదే పెద్ద ప్రశ్న. కొత్తగా వినిపిస్తున్నది కాదు. ఎప్పటి నుంచో వున్నదే. ఈ మధ్య కాస్త యాక్టివ్ గా హరి హర వీరమల్లు సినిమా మీద వుండేసరికి ఫ్యాన్స్ కు కాస్త ఆశలు చిగురించాయి. హరి హర వీరమల్లు సినిమా ఎలాగోలా ఈ ఏడాది విడుదలవుతుంది. అందులో పెద్దగా సందేహ పడాల్సింది లేదు. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి ఏమిటన్నది కీలకం.
ఈ నెలలో పీపుల్స్ మీడియా సినిమా షూట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు పవన్. కానీ ఎప్పుడు అన్నది ఇంకా తేలలేదు. ఫస్ట్ వీక్, పండగ మర్నాటి నుంచి, కాదు 26 నుంచి అంటూ వాయిదాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఎలాగో అలా ముగిస్తారు అనుకున్నా, సుజిత్ సినిమా చాలా భారీ అని టాక్. దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నే బోలెడు వుందని వినిపిస్తోంది. మరి అది ఎప్పుడు మొదలుపెట్టి, ఎప్పుడు ముగిస్తారో చూడాలి.
ఇవన్నీ అయిన తరువాతనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా మాస్ సినిమా కనుక ఎన్నికల ముందు అయితే బెటర్ అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఎన్నికల తరువాతకు వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే 2024లో పవన్ కు సినిమాలు చేసే సమయం చిక్కదని లెక్కలు కడుతున్నారు. ఏం చేసినా ఈ ఏడాదే చేయాలని, అందువల్ల ఈ ఏడాదికి రెండు సినిమాలు పూర్తి చేసి, మిగిలిన రెండూ ఎన్నికల తరువాతకు ఫిక్స్ చేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.