కొన్ని అరబ్ దేశాల్లో బాగా డబ్బున్న వాళ్లు పులుల్ని పెంచుకుంటారు. వాటితో ఫొటోలు దిగుతుంటారు. బీచ్ లో షికార్లు చేస్తుంటారు. మరి అలాంటి సీన్ ఇండియాలో కనిపిస్తుందా? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో కాళీ సింధ్ నది ఒడ్డున అకస్మాత్తుగా ఓ చిరుత ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు పరుగులుతీశారు. కానీ ఆ చిరుత నెమ్మదిగా కదులుతోంది. మనుషుల్ని చూసినా గాండ్రించడం లేదు, వెంటాడడం లేదు. దీంతో ధైర్యం చేసి కొంతమంది దాన్ని సమీపించారు.
మనుషులు దగ్గరకొచ్చినా చిరుత ఏమీ అనలేదు. దీంతో కొంతమంది తమ వికృత చేష్టల్ని దానిపై చూపించారు. చాలామంది చిరుతతో సెల్ఫీలు దిగగా, మరికొంతంది చేతికందిన కర్రలతో కొట్టారు. ఇంకొంతమంది దాని తోక పట్టుకొని లాగారు. ఓ ఇద్దరు మాత్రం మరీ దారుణంగా చిరుతపైకి ఎక్కి దానిపై స్వారీ చేసే ప్రయత్నం చేశారు.
ఓవైపు జనాలు ఇంత చేస్తున్నా.. ఆ చిరుత మాత్రం ఏమీ అనలేదు. నిదానంగా నడుస్తూ అలా ముందుకెళ్లిపోయింది. ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. ఆ చిరుత తీవ్రంగా అస్వస్థతకు గురైంది. అందుకే అది పరుగెత్తలేకపోయింది. దీన్ని ఆసరాగా తీసుకొని స్థానికులు రెచ్చిపోయారు.
సరదా మొత్తం తీర్చుకున్న తర్వాత అప్పుడు తాపీగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు, చిరుతను సంరక్షించి, దానికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వైరల్ అయిన వీడియోలోని వ్యక్తులపై పోలీసు కేసులు పెట్టేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.