చైనా లో కరోనా విపరీతంగా విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో మళ్లీ అంతర్జాతీయంగా కరోనా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి దాదాపు ఏడాది నుంచి కరోనా భయాల విషయంలో కాస్త రిలాక్స్ అయిన ఇండియా లో కూడా కరోనా గురించి చర్చ జరుగుతూ ఉంది. గత ఏడాది ఈ సమయంలో ఇండియాలో ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి చాలా వేగంగా ఉండేది. గత సంక్రాంతి, ఆ తర్వాత పక్షం రోజుల పాటు కూడా ఒమిక్రాన్ వేరియెంట్ కరోనా కేసులు విపరీతంగా నమోదయ్యాయి. జనవరి నెలాఖరు వరకూ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనలు రేపింది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తి నియంత్రణలోకి వచ్చింది.
ప్రజలైతే జాగ్రత్త చర్యలను కొనసాగించారు కానీ, ఫిబ్రవరి నెలాఖరు నుంచి పరిస్థితి దాదాపు సద్దుమణిగింది. ఆ తర్వాత కరోనా భయాలు క్రమంగా తొలగిపోయాయి. అయితే గత ఏడాది జూన్ నుంచినే కేసులు మళ్లీ పెరుగుతాయనే విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో కరోనా గురించి దాదాపు జనాలు మరిచిపోయారు.
ఎంతలా అంటే.. జ్వరం ఇతర లక్షణాలు కనపడినా చాలా చోట్ల కరోనా పరీక్షలు చేయడం కూడా ఆగిపోయేంత! అయితే కరోనా ఎక్కడకూ వెళ్లలేదని, ప్రభావం తగ్గిందని, జ్వరం తదితర కరోనా లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్ష చేయడం మంచిదే అని వైద్యులు చెప్పసాగారు. అయితే కొందరు వైద్యులే కరోనా టెస్టులు అవసరం లేదని లైట్ తీసుకున్నారు. ఈ పరిస్థితి వల్ల అక్కడక్కడ పోస్ట్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి! జ్వరం వచ్చినప్పుడు కరోనా టెస్టులు చేయకపోవడం వల్ల.. కొందరు పోస్ట్ కోవిడ్ లో ఇబ్బంది పడ్డారు. అయితే అవి ఏ లక్షకో కేసు.
మరి ఇంతకీ చైనా పరిణామాలు మళ్లీ ఇండియాలో కరోనా కేసులను రేపుతాయా అనేది మిస్టరీ. ఈ నేపథ్యంలో జనవరి తొలి వారంలో పరిస్థితి ఏమిటంటే.. డిసెంబర్ చివరి వారం లో కన్నా కేసుల సంఖ్య అత్యంత స్వల్ప స్థాయిలో పెరిగింది. డిసెంబర్ చివర్లో వారానికి 1219 కేసులు నమోదు కాగా, గత వారం రోజుల నుంచి ఈ కేసుల సంఖ్య 1526కు చేరింది. దేశవ్యాప్తంగా కలిసి ఈ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో నమోదయ్యాయి. కర్ణాటకలో అంతకు ముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగి 276కు చేరింది.
బహుశా ఇంతకు ముందు కరోనా టెస్టులను లైట్ తీసుకోవడం, ఇప్పుడు మళ్లీ కాస్త లక్షణాలు కనిపించగానే టెస్టులు చేస్తూ ఉండటం కూడా ఈ స్వల్ప పెరుగుదలకు ఒక కారణం కావొచ్చు.