“ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయాడు” ఈ వాక్యం చెప్పుకోవడానికి, పేపర్లలో చదువుతున్నప్పుడు సింపుల్ గానే అనిపించొచ్చు. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో సదరు హీరోల్ని అడిగితే చెబుతారు. కమల్ హాసన్ నుంచి మాస్ సినిమాలు ఎందుకు రావు. చిరంజీవి నుంచి క్లాస్ మూవీస్ ఎందుకు రావు అనే ప్రశ్నలకు సమాధానం ఈ వాక్యమే.
అందుకే హీరోలంతా తమకున్న ఇమేజ్ ను వదిలించుకోవడానికి కష్టపడుతుంటారు. కానీ అలా సక్సెస్ అయింది చాలా కొద్ది మంది మాత్రమే. ప్రస్తుతం తెలుగులో కొంతమంది హీరోలు అలాంటి స్ట్రగుల్ లోనే ఉన్నారు. పాత ఇమేజ్ ను వదిలించుకోలేక, కొత్త ప్రయోగాలు చేయలేక సతమతమౌతున్నారు.
నితిన్ కెరీర్ కిందా..మీద..
ఇప్పటి హీరోల్లో ముందుగా ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి నితిన్. ఇకపై లవ్ స్టోరీలు చేయనని ప్రకటించాడు నితిన్. మంచి పాత్రలు పోషిస్తానని, కంటెంట్ డ్రైవ్ చేసే సినిమాలు చేస్తానని అన్నాడు. చెప్పినట్టే చేశాడు కూడా. కానీ ఫలితం శూన్యం. చెక్ సినిమా ఇతడి ఆలోచనలకు చెక్ పెట్టింది.
ఆ దెబ్బతో పవర్ పేట ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయకముందే ఆపేశాడు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కాన్సెప్ట్ ను కూడా రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అంటూ మరోసారి మాస్ బాట పట్టాడు.
ఇప్పుడు నాగశౌర్య వంతు..
నితిన్ టైపులోనే నాగశౌర్య కూడా ఆలోచిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శౌర్య, తాజాగా తను కూడా ప్రేమకథలకు దూరమని ప్రకటించాడు.
లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం అవుతానని.. హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని ఉందని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టుగానే సిక్స్ ప్యాక్ సాధించాడు. అయితే ఇమేజ్ మార్చుకోవడం అంత ఈజీ కాదనే విషయం శౌర్యకు తెలుసు. గతంలోనే ఓసారి ఇలాంటి ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు ఈ హీరో.
ఉన్నంతలో అల్లరోడు బెటర్..
ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నంతలో కాస్త మంచి ఫలితాలు సాధించిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అల్లరి నరేష్ మాత్రమే. వరుసగా కామెడీ సినిమాలు, మూస పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని బోర్ కొట్టించిన ఈ నటుడు.. ఇమేజ్ ఛేంజ్ కోసం చాలా ప్రయత్నించాడు. అందులో భాగంగా మహర్షి సినిమాలో సీరియస్ రోల్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత నాంది సినిమా చేసి ఫుల్ మార్కులు కొట్టేశాడు.
అయితే ఇలా ఇమేజ్ చట్రం నుంచి బయటకురావాలనుకునే హీరోలందరూ అల్లరి నరేష్ లా అనుకున్నది సాధించలేరు. నా పేరు సూర్య అంటూ ఓ కొత్త ప్రయత్నం చేసిన బన్నీ తను అనుకున్నది సాధించలేకపోయాడు. ఇలా ఇమేజ్ షిఫ్ట్ లో సక్సెస్ రేట్ కంటే ఎదురుదెబ్బలే ఎక్కువ. కాబట్టి నటులకు ఇమేజ్ అనేది వదిలించుకుంటే పోదు. ఉన్న ఇమేజ్ ను కొనసాగిస్తూనే అడపాదడపా కొత్తగా ప్రయత్నించడం బెటర్.