ఆ పదవి నీదా… నాదా సై..!

రాజకీయ పార్టీ అంటేనే రాజకీయాలు చేసే పార్టీ. అంతర్గత రాజకీయాలతో సతమతమయ్యే పార్టీ. అంతర్గత రాజకీయాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయిగాని కాంగ్రెసు పార్టీ రాజకీయాలు ఎక్కువగా రచ్చకెక్కుతుంటాయి. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవుల కోసం,…

రాజకీయ పార్టీ అంటేనే రాజకీయాలు చేసే పార్టీ. అంతర్గత రాజకీయాలతో సతమతమయ్యే పార్టీ. అంతర్గత రాజకీయాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయిగాని కాంగ్రెసు పార్టీ రాజకీయాలు ఎక్కువగా రచ్చకెక్కుతుంటాయి. ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవుల కోసం, అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవుల కోసం కాంగ్రెసు నాయకులు కొట్టుకుంటూనే ఉంటారు. తెలంగాణ కాంగ్రెసులో ప్రస్తుతం కొట్టుకునే సీన్‌ జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం నాయకులు ఎప్పటినుంచో పోటీ పడుతున్నారు. ఇలా కిందామీదా పడుతుండగానే మధ్యలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవిని పక్కన పెట్టి హుజూర్‌నగర్‌లో అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే విషయంలో రచ్చకెక్కారు.

సరే…చివరకు అధిష్టానం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భార్య పద్మావతికి అంగీకారం తెలపడంతో గొడవలు పక్కకు పెట్టక తప్పలేదు. అక్కడ టీఆర్‌ఎస్‌ సూపర్‌డూపర్‌గా గెలవడంతో ఆ కథ ముగిసిపోయింది. ఆ కథ ముగిసిపోగానే మళ్లీ టీపీసీసీ అధ్యక్ష పదవి కథ తెర మీదికి వచ్చింది. హుజూర్‌నగర్‌లో పార్టీ గెలిచివుంటే ఎలా ఉండేదోగాని ఓడిపోవడంతో అధ్యక్ష పదవిని సాధ్యమైనంత తొందరగా కైవసం చేసుకోవాలని కీలక నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పదవిని సాధించాలని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి రెడ్డి వర్గం. మరోటి బీసీల వర్గం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తేవడంలో రెడ్డి వర్గం విఫలమైంది. చివరకు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ మట్టికరిచింది. అందుకే టీపీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి వర్గానికి కాకుండా తమకు ఇవ్వాలని బీసీ వర్గం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పోరాటం ఇలా ఉండగా, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిని ఎట్టి పరిస్థితిలోనూ టీపీసీసీ అధ్యక్షుడిగా కానివ్వకూడదని మరో పోరాటం సాగుతోంది. రేవంత్‌ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక సమయంలోనూ రేవంత్‌ తన అభ్యర్థిని ప్రతిపాదించడంతో గొడవలు జరిగాయి. చివరకు అధిష్టానం పద్మావతిని ఖరారు చేయడంతో సర్దుబాటు చేసుకొని 'అక్క'ను గెలిపిస్తానంటూ ప్రచారం చేశాడు. ఉప ఎన్నికలో భార్య ఓడిపోవడంతో డీలా పడిన ఉత్తమ్‌ కుమార్‌ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపించడంలేదంటున్నారు. రెడ్డి వర్గం నుంచి ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో బీసీ వర్గం నాయకులు తమకు అవకాశం ఇవ్వాలంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడిగా జానారెడ్డి ఉన్నప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారని బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. కాని రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇది ఒక్క కాంగ్రెసు పార్టీకే పరిమితం కాలేదు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌ బీసీలకు టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానాన్ని కోరాడు.

అంతేకాకుండా అవకాశం ఉంటే ఆ పదవి తనకే ఇవ్వాలంటున్నాడు. ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు సీనియారిటీ, విధేయత. రామాయణంలో రాముడికి హనుమంతుడు ఎలాగో ఈయన గాంధీ కుటుంబానికి అలాగ. తనది వీరవిధేయత కాబట్టి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత తనకే ఉందని ఈయన భావన. రేవంత్‌ రెడ్డికి పదవి దక్కకూడదని ఈయన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కొందరు నాయకులు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పేరు ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారు వివాదాస్పదులు, రెడ్డి, బీసీ వర్గాలకు చెందినవారు కాబట్టి, ఈ రెండు వర్గాలకు చెందనివాడు, వివాదరహితంగా ఉండేవాడు అధ్యక్ష పదవికి కావాలని కొందరంటున్నారు.

వీరికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కనబడుతున్నాడు. ఈయన ఈ రెండు వర్గాలకు చెందినవాడు కాడు. వివాదాస్పదుడూ కాదు. ఈయనది బలమైన వర్గం కాదు కాబట్టి ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు. గతంలో విజయశాంతి పేరు అధిష్టానం పరిశీలనలో ఉందని వార్తలొచ్చాయి. కాని ఇప్పుడు ఆమె పేరు వినబడటంలేదు. అధిష్టానం వద్ద ఎవరి పైరవీలు వారు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని కోరేవారు కొందరైతే, ఫలానవాడికి ఇవ్వొద్దని చెబుతున్నవారు మరికొందరు.

మున్సిపల్‌ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. మరి ఈ ఎన్నికలకు ముందే అధ్యక్ష కిరీటం పెడతారా? ఈ ఎన్నికలు కూడా ఉత్తమ్‌ సారథ్యంలోనే కానిద్దాం అనుకుంటారా? తెలియడంలేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానానిదే అంతిమ నిర్ణయం కదా.

ఉత్తుత్తినే ఆరోపణలు చేశామని ఒప్పుకున్నట్లేగా!