విషాదం.. కన్నడ పవర్ స్టార్ కన్నుమూత

కన్నడ చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ. శాండిల్ వుడ్ పవర్ స్టార్, అభిమానులంతా అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా పునీత్ కు హార్ట్ ఎటాక్…

కన్నడ చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ. శాండిల్ వుడ్ పవర్ స్టార్, అభిమానులంతా అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా పునీత్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. హుటాహుటిన ఆయన్ను విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా పునీత్ ను కాపాడలేకపోయారు. ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 46 ఏళ్లు. పునీత్ కు ఇద్దరు పిల్లలు.

కన్నడ సినీ ప్రేక్షకుల దైవం రాజ్ కుమార్ చిన్నకొడుకు పునీత్ రాజ్ కుమార్. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్నప్పట్నుంచే సినిమాల్లో నటించారు పునీత్. బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ సైతం అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎదిగారు. కన్నడ సినీప్రేక్షకులతో పవర్ స్టార్ అనిపించుకున్నారు. కన్నడనాట అత్యథికంగా సక్సెస్ రేట్ కలిగిన హీరోల్లో పునీత్ ఒకరు.

బాలనటుడిగా, హీరోగా, నిర్మాతగా, గాయకుడిగా, టీవీ ప్రజెంటర్ గా.. ఇలా ఎన్నో అవతారాల్లో మెప్పించారు పునీత్. ఇటు టాలీవుడ్ తో కూడా మంచి సత్సబంధాలు కలిగి ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు పునీత్ చాలా క్లోజ్. పునీత్ నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ పాట కూడా పాడాడు. ఇటీవల ఆయన నటించిన యువరత్న సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలున్నాయి. రెండూ సెట్స్ పై ఉన్నాయి. అంతలోనే ఇలా హఠాత్తుగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు పునీత్.

పునీత్ హఠాన్మరణంతో కన్నడ నాట హై-ఎలర్ట్ ప్రకటించారు. బెంగళూరుతో పాటు కర్ణాటకం మొత్తం హై-ఎలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుచేసింది. కర్నాటక మొత్తం థియేటర్లు మూసేశారు. విక్రమ్ హాస్పిటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.