కాంగ్రెస్ పార్టీ గురించి అతిశయోక్తులు నేతలు ఎంత చెప్పుకున్నా ఆ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. శతాధిక సంవత్సరాల చరిత్ర గలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి పురాతనమైనది. ఈ రోజున దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా కాంగ్రెస్ విశిష్టత దానికి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి విభజన తరువాత ఏపీలో నూకలు చెల్లాయి. వరసబెట్టి రెండు సార్వత్రిక ఎన్నికల్లో నోటాతో పోటీ పడలేక వెనకబడిపోయింది. కాంగ్రెస్ కి చెందిన నాయకులు అంతా ఇతర పార్టీలలో సర్దుకున్నారు.
విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటే ఉత్తరాంధ్రా టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, టి సుబ్బరామిరెడ్డి వంటి మహనీయులు గుర్తుకు వస్తారు. సిటీ కాంగ్రెస్ పార్టీ ఎపుడూ నాయకులతో కళకళలాడుతూ ఉండేది. అలాంటిది అడ్డగోలు విభజన తరువాత గత కాంతులు మసకబారి చివరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కూడా తాళాలు పడిపోయాయంటే అశ్చర్యం పడాల్సింది లేదేమో
కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీకి పన్ను బకాయిలు కింద నలభై లక్షల రూపాయ్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయి కోసం ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ నుంచి రియాక్షన్ లేకపోవడంతో పార్టీ ఆఫీస్ ని సీజ్ చేశారు అధికారులు. పీసీసీ కొత్త ప్రెసిడెంట్ గా నియమితుడైన గిడుగు రుద్రరాజు తాజాగా అదే ఆఫీసులో మీడియా మీటింగ్ పెట్టారు.
ఆయన దృష్టికి ఈ బకాయిలు తెచ్చారు. అయితే ఆయన సైతం పట్టించుకోకపోవడంతో జీవీఎంసీ అధికారులు తమ పని తాము కానిచ్చేశారు. నలభై లక్షల పన్ను బకాయి ఎవరు తీరుస్తారు. ఎపుడు పార్టీ ఆఫీసు తెరచుకుంటుంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఒకనాడు హిమ శిఖరాలు చూసిన కాంగ్రెస్ ఇపుడు పాతాళం అంచులను చూస్తోంది అంటే ఇదేనేమో.