మత్స్యకారులు ఏరోజుకారోజు సంపాదన ఇంటికి తెచ్చుకుని జీవనం సాగిస్తుంటారని అనుకుంటారంతా. కానీ పశ్చిమబెంగాల్ లోని మత్స్యకారులు తమ జీవితం సెట్ అయ్యే రోజు కోసం వేచి చూస్తుంటారు. అవును.. ఏళ్ల తరబడి వారు ప్రాణాలకు తెగించి వేటకు వెళ్లేది అందుకే. ఆ చేప పడిందంటే చాలు వారి లైఫ్ సెట్ అయిపోయినట్టే. దానిపేరే తేలియా భోలా చేప.
దాని కడుపంతా ఔషధ గుణాలుంటాయి. పొలుసు దగ్గర్నుంచి, చేపలోని ప్రతి భాగమూ విలువైనదే. ఎంత విలువైనదంటే.. లక్షల రూపాయలకు అమ్ముడుపోయేంతలా. మందుల తయారీలో, ఓ రకమైన మందుల ప్యాకింగ్ కోసం ఈ చేప నుంచి తీసుకున్న పదార్థాలను వినియోగిస్తుంటారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ చేప తమ వలకు చిక్కాలనుకుంటారు బెంగాల్ మత్స్యకారులు.
తాజాగా సుందర్ బన్ ప్రాంతంలోని నదిలో ఐదుగురు మత్స్యకారుల వలకు 75 కేజీల తేలియా భోలా ఫిష్ దొరికింది. కేజీ 49,300 రూపాయల చొప్పున 75కేజీల ఈ భారీ చేప 37 లక్షల రూపాయలు పలికింది. గతేడాది పుష్ప అనే మహిళకు నదిలో 52 కేజీల భోలా ఫిష్ దొరికింది. అప్పట్లో దాన్ని 3లక్షల రూపాయలకు అమ్మారు. ఒక్కసారి ఈ చేప వలలో పడితే చాలు, డబ్బుల మూట దొరికినట్టే.
భోలా పడితే బంగారం దొరికినట్టే..
భోలా చేపలు సహజంగా సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఓ పట్టాన ఇవి వలకు చిక్కవు. ఒకవేళ చిక్కినా ఆ గుంపు మొత్తం వలను తప్పించుకుని వెళ్తుంది. ఎప్పుడైనా గుంపులో నుంచి కొన్ని చేపలు పక్కకు వస్తే మాత్రం అప్పుడు జాలర్లకు పంట పండినట్టే.
దిఘా మత్స్యకార సొసైటీ తరపున వేటకు వెళ్లిన 10 మంది జాలర్లకు ఇటీవల 22 తేలియా భోలా చేపలు దొరికాయి. వీటిని వేలం వేయగా కోటీ నలభై లక్షల రూపాయలకు ఓ ఫార్మా కంపెనీ సొంతం చేసుకుంది.
భోలాను పెంచలేరు..
భోలా చేపల్ని సముద్రంలో వేటకు వెళ్లి పట్టుకోవడమే కానీ, వాటిని కృత్రిమంగా చెరువుల్లో, నీటి కుంటల్లో పెంచే అవకాశం లేదు. అందుకే ఆ చేపకు అంత డిమాండ్. ఒకసారి చేప వలకు చిక్కిన తర్వాత వాటి గుడ్లు ఇక పనికిరావు. వాటిని ఫలదీకరణ చేసి పెంచడం అసాధ్యం.
భోలా దొరికినవాడు అదృష్టవంతుడు. అలాంటి చేపలు ఒక్కసారి వలకు తగిలితే చాలు.. ఇక జీవితాంతం వలకు విశ్రాంతి ఇచ్చినా పర్లేదు అనే నానుడి బెంగాల్ లో ఉంది.