బద్వేల్ ఉప ఎన్నికపై బెట్టింగ్స్‌కు తెరలేచింది. ఏపీ అధికార పార్టీ వైసీపీ మెజార్టీ, అలాగే జాతీయ అధికార పార్టీ బీజేపీ సాధించే ఓట్లపై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే బీజేపీ నేతలు సైతం తమ పార్టీ సాధించే ఓట్లపై మాత్రమే పందెం కడుతుండడం ఇక్కడి ప్రత్యేకత. గెలుపు మాత్రం వైసీపీదేనని బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తుండడం విశేషం.
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో బద్వేల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే బరి నుంచి తప్పుకున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీలో నిలిచి ఏకగ్రీవానికి అడ్డు తగిలాయి. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ అగ్రనేతలు బద్వేల్లో తిష్ట వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పోటీ కేవలం మొక్కుబడే.
ఇక బెట్టింగ్స్ విషయానికి వస్తే…బీజేపీ 18,500 ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేతలతో పాటు కిందిస్థాయి కార్యకర్తల వరకూ కొందరు బెట్టింగ్స్ కట్టినట్టు తెలుస్తోంది. అలాగే వైసీపీకి 80 వేల మెజార్టీ వస్తుందని భారీగా పందేలు జరుగుతున్నాయని సమాచారం.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఈ పందేలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీకి 4 లక్షల మెజార్టీ రాదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరు సుమారు రూ.5 కోట్లు బెట్టింగ్‌లో గెలుపొందారు.
ఇప్పుడు కూడా ఆయనే భారీగా బద్వేల్లో తన పార్టీకి 18,500 ఓట్లు వస్తాయని, అలాగే వైసీపీ మెజార్టీపై భారీగా పందెం కట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి వివిధ అంశాలపై మొత్తం రూ.50 కోట్ల వరకూ బెట్టింగ్ కట్టినట్టు సమాచారం. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా బెట్టింగ్‌లు మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది.