2006లో దేవదాసు చిత్రంతో టాలీవుడ్లో గోవా బ్యూటీ ఇలియానా ఎంటర్ అయ్యారు. ఈ సినిమాకు ఉత్తమ నూతన నటి అవార్డును కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన పోకిరి సినిమాలో ప్రిన్స్ మహేశ్‌బాబు సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. పోకిరి హిట్‌తో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది.
టాలీవుడ్ అగ్రనటులు ప్రభాస్, పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా, రవితేజ తదితరుల సరసన నటించి టాలీ వుడ్ ప్రేక్షకుల్ని బాగా దగ్గరయ్యారు. ఇలియానా పుట్టి పెరిగింది ముంబయ్‌లో అయినప్పటికీ, ప్రస్తుతం గోవాల్ సెటిల్ అయ్యారు. సినిమాల్లోకి రాక ముందు వాణిజ్య ప్రకటనలకు మోడలింగ్ చేసే వారామె.
ప్రస్తుతానికి వస్తే…లాక్డౌన్లో తన అనుభవాల గురించి ఇలియానా మీడియాతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. తాజాగా ఆమె చెప్పిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.
మార్చి చివరి వారంలో లాక్డౌన్ విధించినప్పుడు చాలా మందిలాగే…ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని భావించాన న్నారు. ఆ తర్వాత రోజులు నెలలుగా మారాయని, ఈ పరిస్థితులను అసలు ఊహించలేదన్నారు. తన తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారని, కుటుంబంతో తనకు అనుబంధం ఎక్కువని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో తాను ఒంటరి అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
తన వర్కౌట్ రొటీన్‌ను క్రమంగా తప్పకుండా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ఇలియానా తెలిపారు. దాని కోసం 80 రోజుల ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించి మరింత సమయం కేటాయించినట్టు తెలిపారు. అయితే వ్యాయామాలతో ఒక్కరోజులోనే ఏవో అద్భుతాలు జరిగిపోతాయని తాను అనుకోవడం లేదన్నారు. వ్యాయామం వల్ల ఫస్ట్ డే నుంచి చురుగ్గా ఉంటామన్నారు. అలాగే ఉత్సాహంగా పని చేస్తామన్నారు. అందువల్లే ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గంట పాటు వర్కౌట్స్ చేస్తానన్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండడం వల్ల తనను తనలా ఉంచినట్టు చెప్పుకొచ్చారామె. నిజానికి లాక్డౌన్లో అతి పెద్ద సమస్య మానసిక ఒత్తిడి అని అన్నారామె. తాను కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడినట్టు చెప్పారు. కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా బతకడం అంటే అంత సులభం కాదన్నారు. లాక్డౌన్ మొదటి వారం చాలా భారంగా గడిచిపోయిం దన్నారు. ఆ సమయంలో తన మనసు ఆందోళనకు గురి కాకుండా, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు దగ్గరికి రాకుండా మనసును అదుపులో ఉంచుకోడానికి ప్రధాన కారణం వ్యాయామమే అని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక రోజు అనారోగ్యానికి గురయ్యానన్నారు. జ్వరం వచ్చిన ఫీలింగ్ కలిగిందన్నారు. కడుపులో మంట బాగా ఇబ్బంది పెట్టినట్టు ఇలియానా తెలిపారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ వర్కౌట్స్ చేయకుండా ఉండలేక పోయినట్టు ఆమె తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాయామం తనకు ఒక వ్యసనంలా తయారైందన్నారు. ఇక భవిష్యత్‌లో సాధారణ పరిస్థితులు రాగానే…ఫస్ట్ ప్లైట్కే అమెరికాకు ఎగిరిపోతానని చెప్పుకొచ్చారు. అమెరికా వెళ్లిన వెంటనే అమ్మను కౌగిలించుకుంటానని అన్నారు.