“అబ్బెబ్బే నా జీవితం రాజకీయాలకే అంకితం, నేను ఇక సినిమాల్లోకి వెళ్లను, అవన్నీ వట్టి పుకార్లు, పాతికేళ్లు మీకోసం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, సీఎం పదవిపై నాకు వ్యామోహం లేదు, ప్రజాసేవకే నా జీవితం అంకితం”.. ఇలాంటి మాటలు చాలానే చెబుతున్నారు పవన్ కల్యాణ్. టాలీవుడ్ రీఎంట్రీపై వస్తున్న వార్తల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఏకంగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తుంటారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం సీక్రెట్ గా కొన్ని కథలు వింటున్నారని సమాచారం. కొరటాల శివ, త్రివిక్రమ్.. ఇలా కొంతమంది దర్శకుల పేర్లు కూడా బైటకొచ్చాయి.
కానీ పవన్ మాత్రం సినీ రీఎంట్రీని ఎందుకో చాలా గోప్యంగా ఉంచుతున్నారు. పోనీ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉన్నాను, మంచ కథ వస్తే చేస్తానని ఉన్న విషయం చెప్పొచ్చు కదా. పవన్ మాత్రం అలా చెప్పుకోడానికి ఎందుకో ఇష్టపడటం లేదు. ఒకవేళ మనసుకి నచ్చిన కథ రాకపోతే, సినిమా చేయలేకపోతే… తనని పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనుకుంటారేమోనన్న అనుమానం. ఇప్పుడైనా పవన్ కల్యాణ్ ని ఎవరూ ఫుల్ టైమ్ పొలిటీషియన్ అనుకోవడంలేదు.
కొన్ని రోజులు రెస్ట్, మరికొన్ని రోజులు, సమీక్షలు, ఇంకొన్నిరోజులు ధర్నాలు… ఇదీ పవన్ పొలిటికల్ డైరీ. అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా అదృశ్యం కావడం, కొన్నిరోజులపాటు పార్టీ నాయకులకు కూడా సమాచారం లేకుండా పోవడం పవన్ కే చెల్లుతుంది. అందుకే పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో గుంభనంగా ఉంటున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం పవన్ సీక్రెట్ టాక్స్ ని బైటపెట్టారు. పవన్ బాబాయ్ సినిమా కథలు వింటున్నారని, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చారు.
పవన్ ఇంతవరకూ సీక్రెట్ గా పెట్టుకున్న విషయాన్ని తన దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూలో బైటపెట్టారు రామ్ చరణ్. మరి ఇప్పుడైనా పవన్ దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి. పవన్ కల్యాణ్ కొడుకు, తనకు తమ్ముడు వరసయ్యే అకీరా సినీ ఎంట్రీ విషయంపై కూడా చరణ్ రియాక్ట్ అయ్యారు. అకీరాని కొణిదెల బ్యానర్లో పరిచయం చేస్తామన్నారట కదా అన్న ప్రశ్నకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాం, వాడు ఎప్పుడు రెడీ అంటే మేం అప్పుడు రెడీ అని అంటున్నారు రామ్ చరణ్. అంటే వదిన రేణూ దేశాయ్, పిల్లలతో మెగా ఫ్యామిలీ మంచి రిలేషన్ షిప్ నే కలిగి ఉందని అర్థమవుతోంది.