చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు.. నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో రాకెట్ అనేంత బిల్డప్ ఇచ్చింది అతడి అనుకూల మీడియా. అయితే అసలు ఈ టూర్ లో చినబాబు ఎందుకు మిస్సయ్యారు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయింది. బాబు తర్వాత ఆ స్థానంలో కూర్చోవాల్సిన వ్యక్తి, ఇప్పటినుంచీ అన్నీ తానై నడిపించాలని అనుకుంటున్న వ్యక్తి, భావి టీడీపీ అధ్యక్షుడు.. నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లలేదు?
ఏపీలో ఏదో జరిగిపోయిందని నానా యాగీ చేస్తున్నారు కదా, ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని కోరడానికి వెళ్లారు కదా.. పోతూ పోతూ లోకేష్ ని కూడా చంకన పెట్టుకుని పోవచ్చు కదా..?
వాస్తవానికి చంద్రబాబు తనతో పాటు కొడుక్కి కూడా సరైన ప్రమోషన్ కావాలనుకుంటే ఢిల్లీ టూర్ కి ఆయన్ని కూడా తీసుకెళ్లాల్సింది. అక్కడ అందరికీ పరిచయం చేస్తూ తన రాజకీయ చాణక్యాన్ని నేర్పించాల్సింది. కానీ ఆయన ఆ పని చేయలేదు. కొడుకుని పక్కనపెట్టారు.
కొడుకునే కాదు, కొడుకుతో రాసుకుపూసుకు తిరిగే ఓ బ్యాచ్ ని కూడా చంద్రబాబు కొంత కాలంగా పక్కనపెడుతున్నారని, ఈ విషయంలోనే తండ్రీ కొడుకుల మధ్య అంతరం పెరుగుతోందని ఇటీవలే గ్రేట్ ఆంధ్ర కూడా ఓ కథనాన్నిచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బాబు టూర్ రుజువు చేసింది. లోకేష్ తో కలసి ఉండే పిల్ల బ్యాచ్ ని చంద్రబాబు పక్కనపెట్టేస్తున్నారు. ఇప్పుడే కాదు.. రాబోయే ఎన్నికల్లో కూడా లోకేష్ కి కానీ, ఆయన కోటరీకి కానీ ఎక్కడా అవకాశం లేకుండా చేస్తున్నారు బాబు.
అన్నింటికీ సీనియర్లే..
ఇప్పటివరకూ సీనియర్లని నమ్ముకునే చంద్రబాబు నిండా మునిగిపోయారని అందరికీ తెలుసు. కానీ ఇంకా బాబు అదే ఓల్డ్ స్కూల్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. నమ్మకద్రోహం ఎంత పవర్ ఫుల్లో బాబుకి బాగా తెలుసు కాబట్టే.. తనకు పూర్తి అనుకూలం అనుకునే బ్యాచ్ నే వెంట తిప్పుకుంటున్నారు. ఈమధ్య అలకపాన్పు ఎక్కిన కేశినేని నాని ఢిల్లీ టూర్ లోనూ కనిపించడం విశేషం.
ఇంతమందికి స్పేస్ ఇచ్చిన బాబు, కన్న కొడుక్కి, అందులోనూ త్వరలోనే పగ్గాలు అప్పజెప్పాలనుకుంటున్న వారసుడికి ఢిల్లీ పర్యటనలో చోటు ఇవ్వకపోవడమే విచిత్రం. అసలీ ఔట్ డేటెడ్ బ్యాచ్ తో చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.
లోకేష్ అలకబూనారా..?
ఢిల్లీ టూర్ కి తనను దూరంగా పెట్టడంతో లోకేష్ అలిగినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు ఈ విషయాలను ఖండించినా.. కీలక సమయాల్లో తండ్రి తనను దూరం పెడుతున్నారని, ఇలా అయితే తను ఎప్పటికి రాజకీయాలు నేర్చుకోవాలని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.
తండ్రి తన టీమ్ ని దూరంగా పెట్టినా.. ఇప్పట్నుంచే తనకంటో ఓ కోటరీ కావాలని లోకేష్ బలంగా కోరుకుంటున్నారు. సీనియర్లను ఆయన దగ్గరకి కూడా రానివ్వడం లేదు.