పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… టాప్ డైరక్టర్ త్రివిక్రమ్..వీళ్లిద్దరి మధ్య వున్న బాండింగ్ చాలా ఎక్కువ. పవన్ ను ఎవరైనా ఏదైనా విషయంలో ఒప్పించాలి అంటే అది త్రివిక్రమ్ కే సాధ్యం. అందులో సందేహం లేదు. ఈ ఇధ్దరి మధ్య వున్న అనుబంధం నిన్నటికి నిన్న మరోసారి బయటపడింది.
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి పవన్ రావడానికి ఒప్పించింది త్రివిక్రమ్ నే. ఆయన వల్లే అది సాధ్యమైంది. ఆహా అధినేతలతో త్రివిక్రమ్ కు వున్న అనుబంధం వల్ల పవన్ ను ఈ షో కి రప్పించగలిగారు. కానీ త్రివిక్రమ్ మాత్రం షో కి రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ తో కలిసి చాట్ షో లో కూర్చుంటే అన్ని విధాలా అంత బాగోదు. అందుకే తెలివిగా దూరంగా వుండిపోయారు.
అలా అని పూర్తిగా దూరం ఉండిపోలేదు. తెరమీదకు రాలేదు అంతే. తెరవెనుక వ్యవహారాలు అన్నీ చూసుకున్నారు. పవన్ తో పాటు తను కూడా అదే కారులో అన్ స్టాపబుల్ షూటింగ్ లోకేషన్ కు వెళ్లారు.
పవన్-బాలయ్య చాట్ షో షూటింగ్ జరుగుతున్నంత సేపూ తను బయట కేరవాన్ లో ఓపిగ్గా వేచి వున్నారు. ఓ పెద్ద దర్శకుడు అన్ని గంటలు అన్ని పనులు వదిలేసి, అలా కేరవాన్ లో వుండిపోవడం అంటే చెప్పుకోదగ్గ విషయమే. పైగా తన షూటింగ్ కోసం కాదు. తన పని కాదు..తన సినిమా కాదు.
కేవలం పవన్ కళ్యాణ్ కోసం, అతని స్నేహం కోసం అలా రోజల్లా కేరవాన్ లో వుండిపోయారు. టాప్ డైరక్టర్ ఇలా చేసేది, చేయగలిగింది కేవలం ఒక్క పవన్ కోసమే తప్ప మరెవరి కోసం కాదు అంటే అతిశయోక్తి కాదు. అసత్యం అంతకన్నా కాదు.