ఒక్కోసారి అంతే.. సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యారంటే ఓ పట్టాన ఆ అపవాదులు తొలగిపోవు. అందులోనూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించే సెలబ్రిటీలు తమకి తెలియకుండానే ట్రోలింగ్ కి గురవుతుంటారు.
ఇప్పుడు అదే పరిస్థితిలో చిక్కుకుపోయారు నాగబాబు. జబర్దస్ కి జడ్జిగా చేసిన నాగబాబు.. తనని తాను పెద్ద సెటైరిక్ పర్సన్ అనుకుంటారు, అలా అనుకునే ఆయన చాలా కామెడీ వీడియోలు తన యూట్యూబ్ లో పోస్ట్ చేసుకున్నారు. ట్విట్టర్ లో కూడా విపరీతమైన హ్యూమర్ పంచేలా ప్రయత్నించేవారు.
అలా చేసిన తర్వాతే ఆయన ఎక్కువగా సోషల్ మీడియాకి టార్గెట్ అయ్యారు. తాజాగా నాగబాబు దుబాయ్ లో జరిగిన టీ-20 క్రికెట్ మ్యాచ్ కి పోయి ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తీరా ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో నెటిజన్లు బాబుని ఓ రేంజ్ లో తగులుకున్నారు.
వాస్తవానికి ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు చాలామంది సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. వారిలో నాగబాబు కూడా ఒకరు. అయితే కేవలం నాగబాబు మాత్రమే సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. నాగబాబుది ఐరన్ లెగ్ అని, అందుకే ఆయన అడుగు పెట్డడంతో ఇండియా ఓడిపోయిందని అంటున్నారు. నాగబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమే అని ఓ రేంజ్ లో తగులుకున్నారు.
జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మా ఎన్నికల్లో వేలు పెట్టారు, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు.. ఇప్పుడు దుబాయ్ వెళ్లారు, ఇండియాని ఘోరంగా ఓడించి ఇంటికొచ్చారు. అబ్బెబ్బే వద్దమ్మా.. మీరు ఇండియా మ్యాచ్ లకు వెళ్లొద్దమ్మా అంటూ నాగబాబుపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
అసలే క్రికెట్ లో సెంటిమెంట్లు ఎక్కువ. ఆ లెక్కన చూసుకుంటే ఇటీవలే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పక్కన నిలబడి ఆయన ఓటమిని కళ్లారా చూసిన నాగబాబు, తాజాగా దుబాయ్ వెళ్లి మరీ టీమిండియాని ఓడించి వచ్చారని అంటున్నారు. ఎరక్కపోయి వెళ్లిన నాగబాబు, మ్యాచ్ మధ్యలో ఫొటో బయటకు వదిలి ఇరుక్కుపోయారు.
ఇండియా ఓడిపోవడానికి, నాగబాబు వెళ్లడానికి ఇసుమంత సంబంధం లేకపోయినా, ఆయన ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకొని నెటిజన్లు ఇలా ట్రోలింగ్ షురూ చేశారు.