వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఉప ఎన్నికతో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృంధం ఢిల్లీ పర్యటించడానికి లింక్ ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. బద్వేల్ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ ఓటర్ల మద్దతు ఎవరికనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలియజేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తాజాగా ఓ ప్రకటన చేశారు. జనసేన మాత్రం ఇప్పటికే తన మద్దతును బీజేపీకి ప్రకటించింది. ఇక మిగిలింది టీడీపీ.
ఇవాళ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం ఢిల్లీ పర్యటనకు వెళుతోంది. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా ఈ బృందం కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన, ఇతర అంశాలపై ఫిర్యాదు చేయనుంది. బద్వేల్ ఉప ఎన్నిక ముంగిట చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నాయకుల బృందం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టి పారేయలేమని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు చెప్పారు. ఇప్పటికే మోడీ సర్కార్కు మద్దతు ప్రకటిస్తూ టీడీపీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించిన విషయాన్ని ఆ నాయకుడు గుర్తు చేయడం గమనార్హం.
బద్వేల్ ఉప ఎన్నికలో మద్దతు అడుగుతారనే ఆశతోనే ఈ సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. 2024లో బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు… ఇందుకు బద్వేల్ ఉప ఎన్నికను అవకాశంగా తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఢిల్లీకి ఊరికే వెళ్లరు మహానుభావులంటే… ఇదే కాబోలు.