వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. వీరయ్య సినిమాలో వేసిన ఓడ రేవు సెట్ వేసి మరీ మీడియాను ఆహ్వానించారు. సినిమా షూటింగ్ పూర్తయి, ఫస్ట్ కాపీ రెడీ అయి, సరిగ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కొన్ని రోజుల ముందు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కాస్త కొత్తదనమే. అయితే అంతకంటే కొత్తదనం ఏంటంటే.. సినిమా చూసి ఈ ప్రెస్ మీట్ కు వచ్చారు చిరంజీవి.
వాల్తేరు వీరయ్య దాదాపు రెడీ అయింది. ఆ సినిమాను పూర్తిగా చూసి అట్నుంచి అటే ప్రెస్ మీట్ కు హాజరయ్యారు చిరంజీవి. ఫస్ట్ కాపీపై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చిన వెంటనే పాటలు బాగున్నాయంటూ ఆయన మొదలుపెట్టడంతోనే, సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుందనే విషయం అర్థమౌతోంది.
ఈ సినిమాలో వీరయ్య పాత్రను పోషించారు చిరంజీవి. తన పాత్ర ఉత్తరాంధ్ర యాస (శ్రీకాకుళం యాస అనుకోవచ్చు) మాట్లాడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక రవితేజ పాత్ర సెకండాఫ్ లో వస్తుందనే విషయాన్ని కూడా చిరంజీవి బయటపెట్టారు.
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఏఏ అంశాలు మాట్లాడాలో, దాదాపు అవన్నీ ఇవాళ్టి ప్రెస్ మీట్ లో కవర్ చేశారు చిరు. రవితేజ, శృతిహాసన్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. డబ్బులు తీసుకొని పనిచేసే టీమ్ కంటే, ప్రేమను పొంది, తిరిగి ప్రేమను అందించే టీమ్ ఈ సినిమాకు పనిచేశారని అన్నారు.
తను చేసింది రెగ్యులర్ మాస్ సినిమానే అయినప్పటికీ.. ఇందులో ఓ కొత్తదనం ఉంటుందని, సినిమా చూస్తే అది అర్థమౌతుందని ఊరించారు చిరంజీవి. ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చని, అన్ని అంచనాల్ని వీరయ్య అందుకుంటాడని ధీమాగా చెప్పారు. మరీ ముఖ్యంగా తన నుంచి కామెడీ కూడా ఉందని అన్నారు.
రవితేజ మాత్రం ఈ ఫంక్షన్ లో మాట్లాడలేదు. “2 ముక్కలు కూడా మాట్లాడను.. అన్ని ముక్కలు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే..” అంటూ ముగించారు.