సొంత సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి దాడికి దిగారు. ఈయన నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టలేకపోతున్నట్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అభివృద్ధి పనుల కోసం ఉద్యమిస్తామని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం.
తాజాగా మరోసారి ఆయన పింఛన్ల తొలగింపుపై ఘాటు హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది. కోటంరెడ్డి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతో ఎల్లో మీడియా ఆయనతో మాట్లాడించేందుకు ఉత్సాహం చూపుతుండడాన్ని గమనించొచ్చు. వరుసగా సొంత ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎమ్మెల్యే తరహాలో విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మనసులో ఏదో ఉందనే చర్చకు తెరలేచింది. తన నియోజకవర్గంలో 2,700 సామాజిక పింఛన్ల తొలగింపునకు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
పింఛన్ల తొలగింపు నేపథ్యంలో పెద్ద ఎత్తున తన కార్యాలయానికి లబ్ధిదారులు వస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఫోన్ చేసే వాళ్ల సంఖ్య చెప్పనవసరం లేదన్నారు. ఇటీవల ఓ వృద్ధురాలు తన వద్దకు వచ్చిందని, రూ.200 చొప్పున పింఛన్ తీసుకునేటప్పటి నుంచి కంటిన్యూగా లబ్ధిదారురాలైన తనకు నోటీసులు ఇచ్చారంటూ తన దగ్గరికి వచ్చి వాపోయిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
పాత పింఛన్ ఒక్కటీ తీసేయడానికి కూడా వీల్లేదని అధికారులకు తేల్చి చెప్పినట్టు ఆయన అన్నారు. ఒకసారి పింఛన్ తీసేస్తే మళ్లీ పునరుద్ధరించడం కష్టమని ఆయన అన్నారు. అర్హులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. తొలగింపు నిజం కాదనే ప్రచారాన్ని నిజం చేయాలని కోరారు. అవకాశం వుంటే కొత్త పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల కోసమే ఆయన మాట్లాడుతున్నారని అనిపించినప్పటికీ, జగన్ సర్కార్ విధానాలపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఆయన ఖండించకపోవడం గమనార్హం.