విశాఖ కాపునాడు సభలో కాపుల ఆవేదన, ఆక్రోశం చూస్తే… జాలిపడాలో, కోప్పడాలో అర్థం కాని పరిస్థితి. కాపుల ఆవేదనలో అర్థం వుంది. కానీ వారికి నాయకత్వమే శాపమైందనే చేదు నిజం ఈ సభ ద్వారా మరోసారి నిరూపితమైంది. దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం విశాఖలో కాపునాడు సమావేశం నిర్వహించారు.
కాపు నాడు సభలో వక్తల ప్రసంగాల సారాంశం ఏంటంటే… కేవలం నాలుగైదు శాతం మాత్రమే జనాభా వున్న ఆ రెండు కులాలే అధికారంలో ఉంటున్నాయి. 15 శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపు, దాని అనుబంధ కులాలు మాత్రం అధికారానికి దూరంగా ఉంటున్నాయి. ఇదంతా కాపుల్లో ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణం. ఇప్పటికే వంగవీటి మోహనరంగాను భౌతికంగా పోగొట్టుకున్నామని, చిరంజీవిని రాజకీయంగా దూరం చేసుకున్నామని వక్తలు ఆవేదన చెందారు.
ఇప్పుడు మూడో వాడిని (పవన్‌కల్యాణ్) కాపాడుకుందామా? పోగొట్టుకుందామా? అనేది మన చేతల్లోనే వుందని వక్తలంతా ముక్త కంఠంతో చెప్పారు. ఇది పవన్‌కల్యాణ్ కోసం పెట్టిన మీటింగ్ అని వక్తల ప్రసంగాలు తెలియజేశాయి. వక్తల ఆవేశాన్ని, ఆక్రందనను అర్థం చేసుకోవాల్సిందే. అయితే తాము ఎవరి నాయకత్వాన్ని బలపరచాలని విశాఖలో కాపు నాడు సభ నిర్వహించారో, అసలైన ఆ జనసేనానే చంద్రబాబు అధికారానికి కాపు కాయడానికి ఉవ్విళ్లూరుతున్నారనే చేదు నిజాన్ని విస్మరిస్తే ఎలా?
కాపులకు అధికారం దక్కకపోవడానికి పవన్‌కల్యాణ్ లాంటి చిత్తశుద్ధి, నిబద్ధత, స్థిరత్వం లేని నాయకుడికి “కాపు” కాయడమే కారణమని ఆ సామాజిక వర్గం ఎప్పుడు గ్రహిస్తుంది? ఒకవైపు కాపులందరినీ ఒక చోట చేర్చి బహిరంగ సభలు నిర్వహిస్తూ పవన్‌కు మద్దతు తెలపడం ప్రశంసించాల్సిందే. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటూ అనవసర బాధ్యతల్ని తలకెత్తుకోవడాన్ని కాపులంతా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు.
మన బలం ఇది…రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి సత్తా చూపుతాం అనే మాట పవన్‌తో ఎందుకు చెప్పించలేకపోతున్నారు? కాపుల పౌరుషాన్ని, శక్తిని, యుక్తిని చంద్రబాబుకు తాకట్టు పెడుతుంటే ఎందుకు నిలదీయ లేకపోతున్నారు? పోనీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని సీఎం అభ్యర్థిగా బరిలో నిలిస్తే అప్పుడు శభాష్ అంటారు. అలా జరుగుతున్న దాఖలాలు మచ్చుకైనా లేవు. మరి దేని కోసం కాపులంతా పవన్‌కు మద్దతుగా నిలవాలని కాపునాడు సభా వేదికపై నుంచి అభ్యర్థించారో నిర్వాహకులు ఆలోచించాలి.
బీసీల తర్వాత అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గానికి చెందిన కాపు, దాని అనుబంధ కులాలు వెన్నెముక ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన ఆవశ్యకత వుంది. పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుంటే తనతో పాటు కాపులందరినీ చంద్రబాబుకు తాకట్టు పెట్టడం ఖాయమనే విమర్శలను కొట్టి పారేయలేం. ఇలాంటి నాయకుడిని గుడ్డిగా ప్రేమించడం అనే బలహీనత నుంచి బయటపడితేనే ఆ సామాజిక వర్గానికి ఇప్పుడు కాకపోయినా, రేపైనా అధికారం దక్కుతుంది. లేదంటే దేని తోకో పట్టుకుని గోదారి ఈదిన చందమవుతుంది.