రిపబ్లిక్ రన్ ముగిసింది. సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సగం కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేదు ఈ సినిమా.
వరల్డ్ వైడ్ ఈ సినిమాను అటుఇటుగా 12 కోట్ల రూపాయలకు అమ్మారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా మొదటి 3 రోజులు మంచి వసూళ్లు సాధించింది. ఆ వారం బాగానే ఆడింది కూడా. అలా 10 రోజుల్లో ఈ సినిమాకు 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. ఆ తర్వాత సినిమా ఇక కోలుకోలేకపోయింది.
అప్పటికే నెగెటివ్ రివ్యూస్ వచ్చేయడం, నెగెటివ్ మౌత్ టాక్ బాగా వినిపించడంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాలేదు. ఫలితంగా థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి స్టార్లు దిగొచ్చి, గట్టిగా ప్రచారం చేసినప్పటికీ.. ఈ సినిమా ఫలితాన్ని మార్చలేకపోయారు.
అటు సాయితేజ్ కెరీర్ కు కూడా ఈ సినిమా స్పీడ్ బ్రేకర్ లా మారింది. చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి ఊపు మీదున్న సాయితేజ్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో, అప్పటి కరోనా పరిస్థితుల దృష్ట్యా ఓకే అనిపించుకున్నాడు. డీసెంట్ టాక్ తో బయటపడ్డాడు. రిపబ్లిక్ మూవీ మాత్రం అతడికి ఎలాంటి హోప్స్ మిగల్చలేదు. క్లీన్ ఫ్లాప్ అనిపించుకుంది.
ఓవైపు యాక్సిడెంట్ అవ్వడం, మరోవైపు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం సాయితేజ్ కు ఇబ్బందికరంగానే మారింది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలోనే జీ తెలుగు ఛానెల్ లో ప్రత్యక్షం కాబోతోంది.