మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితీశ్ దేశ్ ముఖ్ నే నటీమణి జెనీలియా డిసౌజా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విలాస్ రావ్ మరణించాకా ఆయన తనయుళ్లో ఇద్దరు రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నాడు. రితీశ్ దేశ్ ముఖ్ మాత్రం సినిమాల్లో కొనసాగుతూ ఉన్నారు.
ఇక తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విలాస్ రావ్ తనయులు ఘన విజయాలు నమోదు చేశారు. లాతూర్ రూరల్, లాతూర్ సిటీ నియోజకవర్గాలు.. ఈ రెండింటిలోనూ విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయులు విజయ దుందుభి మోగించారు. అమిత్ దేశ్ ముఖ్ లాతూర్ సిటీ నుంచి నలభై రెండు వేల పైగా ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఇక ధీరజ్ దేశ్ ముఖ్ అయితే లాతూర్ రూరల్ లో ఏకంగా లక్షా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అతడికి మొత్తం లక్ష అరవై వేల ఓట్లు పోల్ కావడం విశేషం. ఇలా విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయులు అత్యంత భారీ విజయాలను నమోదు చేశారు.
ఈ విషయాన్నిజెనీలియా భర్త రితీశ్ ఆనందంగా పంచుకున్నాడు. అయితే వీరు అంత భారీ విజయాలు సాధించినా.. వీరి పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి విజయాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.