'రా చూసుకుందాం.. వస్తే మా తఢాకా చూపిస్తాం.. పోలీసులను పక్కన పెట్టిరా, ఒక్కడివే రా.. నీ చెంపలు పగలగొడతాం, నీ వీపులు పగల గొడతాం.. నీ అంతు చూస్తాం.. నిన్ను బొంద పెడతాం, నిన్ను చెప్పులతో కొడతాం… మేం అధికారంలోకి వస్తే మీ అడ్రస్ లుండవు, చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు… ' ఇవీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి జాలువారుతున్న పదసంపద. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి.. వస్తాదుల్లా సవాళ్లు చేశారు. టీ కొట్టుల వద్ద కొట్టుకునే వాళ్లు జారీ చేసే హెచ్చరికలను వల్లె వేశారు!
ఒకవైపు తనకు సంస్కారం ఉందని, తనకు క్యారెక్టర్ ఉందంటూ చంద్రబాబు నాయుడు డప్పేసుకున్న దీక్షలోనే ఈ మాటలన్నీ జాలువారాయి. తాము సంస్కార పూరిత రాజకీయాలు చేస్తామని, హుందాతనంతో ఉంటామని చంద్రబాబు చెప్పుకుంటున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సంస్కారం లేదని, క్యారెక్టర్ లేని వాళ్లంతా తనను ఉద్దేశించి మాట్లాడతారని చంద్రబాబు నాయుడు నీతులు వల్లె వేయగా.. ఇదే వేదికపై నుంచి తెలుగుదేశం నేతలు ఎవరి రేంజ్ కు తగ్గట్టుగా వారు రెచ్చిపోయారు.
నీతులూ, బూతులూ ఒకే వేదిక మీద నుంచి శరపరంగా వచ్చాయి. చంద్రబాబు నీతులు చెప్పగా.. పార్టీ నేతలంతా బూతులు, తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారు. ఈ విషయంలో లోకేష్ ముందున్నారని వేరే చెప్పనక్కర్లేదు. వస్తాద్ తరహాలో ట్వీట్లేస్తున్న లోకేష్, వేదిక నుంచి కూడా ఒక శాల్తీలా మాట్లాడారు. తనతో ప్రత్యక్ష పోరాటానికి రావాలని లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.
ప్రత్యక్ష పోరాటం అంటే… కొట్టుకోవడమే లోకేష్ మాటల ద్వారా అర్థం అవుతున్న విషయం. రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో పోరాడటం అని ఎవరైనా అనుకుంటారు. అయితే లోకేష్ మాత్రం.. పదే పదే ప్రత్యక్ష పోరాటం, పోలీసులను పక్కన పెట్టిరా, చూసుకుందాం రా, తేల్చుకుందాం రా అంటున్నారు! ఈ సవాళ్లన్నీ ఆకురౌడీని తలపింపజేస్తున్నాయనే కామెంట్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.