అసురన్ సినిమా తమిళనాట రీసెంట్ గా విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా. ధనుష్ హీరో. ఇప్పుడు ఆ సినిమాను విక్టరీ వెంకటేష్ తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యారు. జస్ట్ ఈరోజు సినిమాను చూసి, ఆ వెంటనే ప్రాజెక్టు ప్రకటించేసారు. అసురన్ రీమేక్ చేయబోతున్నాం అంటూ.
సరే, తెలుగులో ఎవరు డైరక్ట్ చేస్తారు? మార్పులు చేర్పులు వగైరా సంగతులు అలావుంచితే, అసలు ఈ సబ్జెక్ట్ తెలుగుకు సెట్ అవుతుందా? అన్న అనుమానాలు వున్నాయి. అలాగే ధనుష్ చేయడం అంటే వేరు. వెంకీ చేయడం వేరు. మిగిలిన హీరోలు, మారుతున్న ట్రెండ్ అన్నీచూసి తాను కూడా ఓ డిఫరెంట్ సినిమా చేయాలని వెంకీ అనుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బలమైన, బలహీనమైన వర్గాలు, వాటి మధ్య అంతరాలు, కక్షలు, దాడులు, ఇలాంటి వ్యవహారాలు అన్నీ చోటు చేసుకున్న సినిమా అసురన్. మామూలుగా అయితే ఇది పక్కా సాదా కథ. ఓ పేదవాడి కుటుంబానికి, డబ్బున్న వాడి కుటుంబానికి మధ్య సాగే పోరు. కానీ సినిమా అలావుండదు. బలమైన, బలహీనమైన కులాలకు చెందిన రెండు కుటుంబాల మధ్య పోరుగా కనిపిస్తుంది. తమిళ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.
ఇది యధాతథంగా తీస్తే తెలుగు జనాలకు కాస్త 'రా'గా వుంటుంది. మారిస్తే దాంట్లో వున్న వైవిధ్యం పోతుంది. మరి విక్టరీ వెంకటేష్ ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఇప్పుడే కదా డిసైడ్ అయింది రీమేక్ చేయాలని.