“పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ”లాగ పూర్తిగా స్వామీజీగా మారిన చంద్రబాబుని మనం చూస్తున్నాం.
ఒక ఎత్తైన దిమ్మ మీద సోఫా వేసి దాంట్లో కుషన్లు పెట్టి చంద్రబాబు గార్ని కూర్చోబెట్టి వరసగట్టి మరీ పాదాభివందనాలు చేసారు తెలుగుదేశం కార్యకర్తలు. ఎవరైన మొహమాటానికైనా ఇలాంటివి వద్దని వారిస్తారు. ఎవరైనా పాదాభివందం చేస్తే వెనక్కి జరుగుతారు. మరీ అనిపిస్తే పాదాభివందం వద్దని ఆలింగనం చేసుకుంటారు. ఇవేమీ లేకుండా రెండు పాదాలని ప్రజలకి అర్పించేసి దండాలు పెట్టించుకోవడమంటే పెద్దరికం కాదు స్వామితనం వచ్చినట్టు.
తెలుగుదేశం కార్యాలయాలపై దాడులకి నిరసనగా చంద్రబాబు చేసిన దీక్షలో పై దృశ్యం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
అసలాయన్ని ఈ భ్రమలోకి నెట్టి పిచ్చిమారాజుని చేస్తున్న తెలుగుతమ్ముళ్లని అనాలి. ఇలాంటి చేష్టల వల్ల వాళ్లకేమో గానీ తక్కిన ప్రజానీకానికి మాత్రం కామెడీగా ఉంటుందని గ్రహించకపోవడం ఆశ్చర్యం.
ఆ వీడియో బిట్ కి “అన్నానికి అరిటాకు..సున్నానికి తంబాకు..పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు..కెవ్వు కేక” అంటూ ఒక పాట తగిలించి వైరల్ చేసి పారేసారు ఇవాళ. ఆ అవకాశం ఇవ్వడమెందుకు? సీరియస్ గా చెయ్యాల్సిన పనిని కామెడీపాలు చేయడమెందుకు?
దీనికి తోడు బాబుగారి పక్కనే నిలబడి తెలుగుదేశం నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు.
రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉందని వరసగా స్పీచులు వింటుంటే నిజమేనేమో అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. బాబుగారికి ఎందుకు కలగదు.
రాష్ట్రమంటే తెలుగుదేశం ఆఫీసొక్కటేనేమో అని కూడా అనిపిస్తుంది.
ఇలా అంటే తెలుగుదేశం వారికి, సానుభూతిపరులకి కోపం రావచ్చు. ఒకవేళ రాష్ట్రంలో నిజంగా అరాచకం రాజ్యమేలుతున్న మాట నిజమైతే మొన్న తెదేపా ఇచ్చిన రాష్ట్ర బందు పిలుపుకి రాష్ట్రమంతా సంఘీభావం తెలిపుండాలి. ఎవ్వడూ ఒక్క షాపు ముయ్యలేదు. పైగా హెరిటేజ్ షాపులు కూడా ఎవ్వరూ ముయ్యలేదు కదా అని సాయంత్రం నుంచి తెరిచేసారు.
పబ్లిక్ రెస్పాన్స్ ఇలా ఉందంటే అర్థమేంటి? బూతులకి, దాడులకి జనం డిస్టర్బ్ అవ్వలేదు. మొహమాటం లేకుండా చెప్పాలంటే రియాలిటీ షో చూస్తున్నట్టుగా వినోదం పొందారంతే.
ఇరు వర్గాలకి చెందిన మనుషులు, సానుభూతిపరులు తప్ప మిగిలిన జనం అసలు ఖాతరే చెయ్యలేదు.
మరెందుకు ఈ 36 గంటల దీక్ష? చేసామని ప్రొఫైల్ లో చేరుతుంది తప్ప పదిపైసలు ప్రయోజనం కూడా లేదు.
ఆమాటకొస్తే గతంలో చంద్రబాబు ఇలాంటి దీక్షలు చాలానే చేసారు.
2021 జూన్ నెలలో “సాధన దీక్ష” అని ఒకటి చేసారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకి కరోనా బృతి కింద రూ 10000 ఇవ్వాలని, రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించాలని, పోలవరం నిరాశ్రయులకి పరిహారం ఇప్పించాలని ఆ దీక్షలో ప్రభుత్వానికి బాబుగారు చేసిన డిమాండ్లు. పత్రికలు తిరగేస్తే తప్ప ఇలాంటివి ఎవరికైనా గుర్తుంటాయా? ఈ దీక్ష ఫలితం శూన్యమని వేరే చెప్పక్కర్లేదు.
అలాగే ఇంకాస్త వెనక్కి వెళితే 2019 నవంబరులో మరొక దీక్ష చేసారు. దాని పెరు గుర్తులేదు కానీ “ఇసక దీక్ష” అనుకోవచ్చు. రాష్ట్రంలో ఇసక కొరతకి వ్యతిరేకంగా చేసిన దీక్ష అది. ఆ దీక్ష కూడా చెడింది తప్ప ఫలితం రాలేదు.
ఇలాంటి దీక్షలు అడపా దడపా చేస్తూనే ఉన్నారు. వాటివల్ల జనానికే కాదు ఆయనకి కూడా ఉపయొగం ఉండట్లేదు. పైగా స్వామిలోరులాగ ఆయన కూర్చోవడం, చుట్టూ జనాలు చెరి అరుస్తూ ప్రసంగాలివ్వడం ఒక ప్రహసనంలా తయారైంది.
ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షలో గుర్తున్న అంశం చెప్పమంటే బాలకృష్ణ చేసిన హిందీ ప్రసంగం గుర్తొస్తుంది. మోదీని “మక్కీ చూస్” అంటూ వెరైటీ తిట్టు తిట్టిన ఘనత ఆయనదే.
ఇలా వినోదానికి తప్ప అణువంత సెంటిమెంటు గానీ సీరియస్ నెస్ గానీ సృష్టించలేకపోతున్నాయి ఈ దీక్షలు.
ఇక ఈ రోజు దీక్షలో ప్రసంగీకులందరిలోనూ కాస్త బలంగా మాట్లాడింది రాం మోహన్ నాయుడు ఒక్కడే. తెలుగైనా, హిందీ అయినా అనర్గళంగా మాట్లాడి జనాన్ని ఆకట్టుకోగలిగే సత్తా ఉన్న ఏకైక యువనాయకుడు అతనొక్కడే. అంతా మాట్లాడి చివర్లో “మా నాయకుడు లోకేష్ ని చూస్తుంటే కొత్త ఉత్సాహం వచ్చింది..” అంటూ ఏదో అన్నాడు. అక్కడ పడిపోయింది అతని గ్రాఫంతా. స్వామిలోరి మీద భక్తి తప్పులేదు. అతని పుత్రరత్నం మీద కూడానా? లోకమంతా లోకేశుడి ట్యాలెంటు చూసాక కూడా రాం మోహన్ నాయుడు లాంటి మహావక్త అతనిని పొగుడుతుంటే “అయ్యో” అనిపిస్తుంది.
వాస్తవం చెప్పాలంటే బాబుగారు తన పార్టీలో నెంబర్ టూ గా పుత్రప్రేమని పక్కన పెట్టి రాం మోహన్ నాయుడిని పెట్టుకోగలగాలి. ఆ మాత్రం స్థానం ఇవ్వకపోతే ఏదో ఒక శుభముహూర్తాన ఏ బీజీపీయో అతనిని లాక్కుపోయే అవకాశం లేకపోలేదు. గతంలో ఎంతటి రాజకీయ చాణక్యుడని పేరు గడించినా ఏ రాజకీయ ఎత్తుగడ వేసినా పనిజరగక బొక్కబోర్లా పడుతున్న బాబుగారికి ఇలా ఉచిత సలాహలు ఇవ్వాలనిపిస్తోందంటే ఆయన పరిస్థితి ఇలా ఉందేంటా అని జాలేస్తోంది.
శ్రీనివాసమూర్తి