తెరాసకే విజయం?.. సంకేతాలు ఏంటి?

మహారాష్ట్ర, హర్యానాల్లో అధికార పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఇవి అంతిమ ఫలితాలు కాకపోయినప్పటికీ.. అద్భుతాలు జరిగితే తప్ప.. ఫలితాలు తిరగబడకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఫలితాల నడక మరింత స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి…

మహారాష్ట్ర, హర్యానాల్లో అధికార పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఇవి అంతిమ ఫలితాలు కాకపోయినప్పటికీ.. అద్భుతాలు జరిగితే తప్ప.. ఫలితాలు తిరగబడకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఫలితాల నడక మరింత స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె గానీ, వారికి మద్దతుగా ప్రజాసంఘాల ఆందోళనలు గానీ… హూజర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక  మీద ఏమాత్రం ప్రభావం చూపించినట్లు లేదు.

అయిదో రౌండ్ ముగిసే సమయానికి తెరాస సైదిరెడ్డి 11000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించిన మెజారిటీ కేవలం పదివేల ఓట్లు మాత్రమే. రాజకీయాలకు కొత్త అయిన సైదిరెడ్డిపై యాభై వేల ఓట్ల తేడాతో గెలుస్తానని సవాళ్లు విసిరిన ఉత్తమ్ కేవలం పదివేల మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన ఎంపీ అయ్యాక, రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీలో కొందరు వ్యతిరేకించినప్పటికీ.. తన హవా నడిపించి.. భార్య పద్మావతిని బరిలోకి దించారు. ఫలం దక్కేలాలేదు.

ఒక్కస్థానానికి ఉప ఎన్నిక జరిగితే అధికార పార్టీ గెలవడం పెద్ద విశేషం కాదని ఎవరైనా వాదింవచ్చు. కానీ.. ప్రభుత్వం మీద ప్రజల్లో సానుకూల అభిప్రాయం పోయిందని… ప్రభుత్వం ఈ పదినెలల్లో అప్రతిష్ట పాలైందని వాదించే వారు కూడా ఇక నోరు కట్టేసుకోవాల్సిందే! అధికార పార్టీ ఉప ఎన్నికల్లే ఎడ్వాంటేజీ పొజిషన్లో ఉండడం చిత్రంకాదు. కాకపోతే తెలంగాణలో ఈ సమయంలో కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.

ఆర్టీసీ సమ్మె చాలా ఉధృతంగా నడుస్తోంది. తెలంగాణలో ఎంతో ముఖ్యమైన దసరా పండుగ సెలవుల నాటినుంచి వ్యూహాత్మకంగా ఆర్టీసీ సంఘాలు సమ్మెకు దిగి జనజీవితాన్ని ఇరుకున పెట్టాయి. తద్వారా కేసీఆర్ సర్కారును అప్రతిష్ట పాల్జేయదలచుకున్నారు. వారిపై ఒత్తిడి పెంచగలమని అనుకున్నారు. కేసీఆర్ పట్టించుకోలేదు సరికదా.. కోర్టు సూచనల పట్ల కూడా ఖాతరు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు.

మధ్యలో ఈ సమ్మె వల్ల ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులు హుజూర్ నగర్ ఉపఎన్నిక మీద ప్రభావం చూపించవచ్చుననే అభిప్రాయం కొందరికి ఏర్పడింది. కేసీఆర్ అక్కడ తన ప్రచారాన్ని రద్దు చేసుకోవడం కూడా వెనుకంజగా కొందరు అభివర్నించారు. ఇన్నింటి మధ్య కూడా తెరాస విజయపథంలో ఉన్నదంటే.. పవనాలు గులాబీకి అనుకూలంగా ఉన్నట్లే అనుకోవాల్సి వస్తోంది.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే