ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణాలకు చెందిన వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు. చిన్న పనులలోనే అయినప్పటికీ ఓసీలకు చెందినవారికి ఏమాత్రం చోటు లేకుండా చేయడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇదంతా కూడా ప్రభుత్వ పరంగా ఉండే రవాణా కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారం కావడం విశేషం.
ప్రభుత్వం ఇసుక, మద్యం, నిత్యావసర వస్తువులు ఇలాంటి వాటి రవాణా బాధ్యతలను నిరుద్యోగ యువతకు అందించి వారికి ఉపాధి కల్పించాలని నిశ్చయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. రవాణా పనులను బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, కాపు వర్గానికి చెందిన వారికి మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రవర్ణాలకు చెందిన వారికి ఒక్క అవకాశం కూడా దక్కదు.
కులపరమైన వివక్షకు నిదర్శనం లాగా కనిపించే ఈ నిర్ణయం ఏ విధమైన ప్రజాస్పందన రాబడుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. కులాల కేటగిరీలలో కాపులు కూడా ప్రస్తుతానికి అగ్రవర్ణాలు గానే ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం కల్పించారు. కాపులు మినహా తతిమ్మా అగ్రవర్ణాలకు మాత్రమే ఈ రవాణా కాంట్రాక్టుల్లో చాన్సులేదు.
ఇసుక నిలవ కేంద్రాల నుంచి, రీచ్ ల నుంచి కొనుగోలుదారులకు రవాణా చేయడం, మద్యం స్టాక్ పాయింట్ల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణాలకు సరఫరా చేయడం, ప్రజల ఇళ్ల వద్దకు చేర్చదలచుకున్న నిత్యావసర సరుకులను రవాణా చేయడం వంటి బాధ్యతలు యువకులకు కాంట్రాక్ట్ గా అందిస్తారు.
అయితే అగ్రవర్ణ యువకులు చేసిన పాపం ఏమిటో బోధ పడడంలేదు. అగ్రవర్ణాలలో పేదలు, నిరుద్యోగులు, వస్తు రవాణా వంటి చిన్న పనుల మీద ఆధారపడే ఆర్థిక తరగతికి చెందిన వ్యక్తులు ఉండరని జగన్మోహనరెడ్డి అనుకుంటున్నారో ఏమో తెలియదు! నిజానికి, పేదరికానికి కులం ఉండదు అనే సంగతి ప్రభుత్వం తెలుసుకోవాలి.
‘వైయస్సార్ ఆదర్శం’ పేరుతో అమలు చేస్తున్న ఇలాంటి పథకాల ద్వారా అన్ని కులాల వారికి సమన్యాయం జరగాలి. అంతేతప్ప అగ్రకులాల వారి పట్ల వివక్ష చూపుతూ అన్యాయం చేయడం తగదని పలువురు భావిస్తున్నారు. రిజర్వుడు కేటగిరీలకు అన్యాయం జరగకూడదని అనుకుంటే ఇక్కడ కూడా వారికి రిజర్వేషన్ తరహా కోటో ఏర్పాటు చేయవచ్చు తప్ప.. అగ్రకులాల మిషపై పేదలను కూడా దూరం పెట్టడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.