గోదావరిలో మునిగిన వశిష్ట బోటును ఎట్టకేలకూ బయటకు తీశారు. నదీ ప్రవాహం నేపథ్యంలో, నట్టనడుమన మునిగిన బోటును బయటకు తీయడం అంత సులభంగా జరగలేదు. బోటు మునిగి ఐదువారాల తర్వాతకు గానీ దాన్ని బయటకు తీయలేకపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేంద్ర విపత్తు నివారణ శాఖ వారు జోక్యం చేసుకున్నా పరిస్థితి అలాగే కొనసాగింది. ఎట్టకేలకూ స్థానికుల సహకారంతోనే బోటు బయటకు తీశారు.
బోటు మునిగినప్పుడే అందులో ప్రయాణిస్తున్న వారి కుటుంబాలు విషాదంలో కూరుకుపోయాయి. ఒకే కుటుంబానికి చెందిన అందరూ మరణించిన దాఖలాలున్నాయి. అలాగే బోటు ప్రయాణిస్తూనే తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారూ ఉన్నారు. బోటు ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ప్రాణాలతో బయటపడ్డారు, మరి కొందరు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారిలో కొందరి మృతదేహాలు అప్పట్లోనే నదిలో లభ్యం అయ్యాయి. అయితే కొందరి మృతదేహాలు మాత్రం బోటుతో పాటే పూర్తిగా అడుగుకు చేరినట్టుగా అధికారులు నిర్ధారించారు.
బోటును బయటకు తీయడంతో వారి మృతదేహాలు లభిస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు కొందరి మృతదేహాలు దొరికాయి కానీ, మరికొందరి మృతదేహాలు మాత్రం దొరకలేదని తెలుస్తోంది. వారు ఇంకా గల్లంతయిన వారి జాబితాలోనే ఉన్నారు. బోటు బయటకు తీశారనే వార్తను విని, తమ వారి మృతదేహాలు అయినా లభిస్తాయేమో అని గల్లంతయిన వారి సంబంధీకులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అలాంటి వారిలో కొందరికి మళ్లీ నిరాశే మిగిలిందని తెలుస్తోంది. కొందరి మృతదేహాలు బోటుతో పాటు కూడా లభించలేదని అధికారులు కూడా ప్రకటించారు.