వైవీ సుబ్బారెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారిని వీఐపీ కోటాలో దర్శించుకునేందుకు పదివేల రూపాయల ధర నిర్ణయించింది. పదివేల రూపాయల విరాళం ఇస్తే.. 500 రూపాయల వీఐపీ బ్రేక్ టికెట్‌ను ఇచ్చేస్తారు. ప్రోటోకాల్ పరిధిలో దర్శన ఏర్పాట్లు చేయిస్తారు. మహాలఘు దర్శనాలు కాకుండా.. దగ్గరినుంచి శ్రీవారిని చూసుకునే భాగ్యం ఉంటుంది.
ఈ నిర్ణయం మీద చాలా మందిలో చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. మంచిది- చెడ్డది అంటూ ఈ నిర్ణయం గురించి ఇదమిత్థంగా తేల్చిచెప్పడం కష్టం. ఎందుకంటే.. టీటీడీ నిర్ణయించిన రేటు మరీ చోద్యం ఎంతమాత్రమూ కాదు. ఇన్నాళ్లుగా.. తిరుమల వేంకటేశ్వరస్వామిని నమ్ముకుని.. కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న దళారీలు.. ఇంచుమించుగా అదే ధరకు దర్శనం టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు.
కర్ణాకర్ణిగా విన్న ధరలను బట్టి.. బ్లాక్ మార్కెట్ లో ఎల్1 దర్శనం టికెట్ ధర 15వేల రూపాయలు, ఎల్2 అయితే పదివేల రూపాయలు. ఈ ధరలు సామాన్యులకు చిత్రంగా, అబ్బురంగా అనిపించవచ్చు. కానీ… ఇదే ధరలకు ఇన్నాళ్లూ దళారీలు స్వామిని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇంచుమించుగా అదే ధరలకు టీటీడీ.. వ్యవస్థీకృతంగా దర్శనం ఏర్పాట్లు చేస్తోంది. దీనితో దళారీల ఆట కట్టుతుందని అనలేం. వారికి ఇంకా సవాలక్ష మార్గాలు ఉన్నాయి.
టీటీడీ పెద్దలకు స్పష్టంగా తెలిసినా.. వాళ్లు వేలుపెట్టి జోక్యం చేసుకోకుండా ఉండేవి. ఆ మార్గాల్లో వారు తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉంటారు. కాకపోతే ఇలా అధికారికంగా చెల్లించే వారి కోటా అదనంగా చేరుతుంది. అయితే ఇలాంటి ఏర్పాట్ల వల్ల.. సామాన్య భక్తులకు దర్శనసమయం కుంచించుకుపోతుంది. ఈ విషయంలో అధికారులు ఎలాగైనా బుకాయించవచ్చు గాక… కానీ జరిగేది మాత్రం అదే. అలా కాకుండా.. ప్రస్తుతం ఉన్న వీఐపీ ప్రోటోకాల్ కోటాలకు కత్తెరవేసి.. ఎంత కోత విధించారో.. ఆ దామాషాలో మాత్రమే డబ్బున్న వీఐపీలకు టికెట్లు విక్రయిస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుంది.