అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే.. ప్రాంతీయ అసమానతలు, అసంతృప్తులు తొలగుతాయని, అధికార వికేంద్రీకరణ జరిగితే.. ప్రజందరికీ అందుబాటులో ఉండే పాలనతో సత్వర న్యాయం జరుగుతుందని ప్రగతి కాముకులు భావిస్తుంటారు. యువ నాయకుల్లో ఇలాంటి ప్రగతిశీల ఆలోచనా సరళి ఇంకా ఎక్కువగా ఉండాలి. అలాగే వ్యాపార వర్గాల నుంచి వచ్చిన నాయకుల్లో ఈ ధోరణి మరింత ప్రబలంగా ఉండాలి. కానీ.. ఆరెండు కేటగిరీలకు చెందిన తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఇంత వెనుకబాటు ఆలోచనలతో… ముసలి దృక్పథంతో ఎలా మాట్లాడుతున్నారో అంతు చిక్కడంలేదు.
రాజధాని అంతా ఒకేచోట ఏర్పాటు అయితే.. ఉద్యోగాలు వస్తాయట… గల్లా జయదేవ్ ఈ మాట చెబుతున్నారు. వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందనేది ఆయన మరచిపోయినట్టున్నారు. పైగా అమరావతి రాజధాని ప్రస్తుతం నిధుల కొరతతో ముందడుగు వేయలేని స్థితిలో ఉండగా.. అందుకు కారణం వైకాపా పాలనే అని నిందిస్తూ.. జగన్ ను గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారంటూ.. జయదేవ్ వ్యాఖ్యానించడం విశేషం.
హైదరాబాదు చెన్నై బెంగుళూరు ముంబాయి.. లాంటి నగరాలన్నీ ఇందుకు ఉదాహరణలని జయదేవ్ వక్కాణిస్తున్నారు. అయితే నిజానికి ఆయా నగరాలు రాష్ట్రాలకు రాజధానులే కానీ.. విద్యాపరంగా, వ్యాపార, పారిశ్రామిక పరంగా.. అవే రాష్ట్రాలకు రాజధాని స్థాయి నగరాలు ఇతర ప్రదేశాల్లో వృద్ధి చెంది ఉన్నాయని జయదేవ్ కు తెలియదని అనుకోలేం. పరిపాలన రాజధాని కేంద్రం ఒకచోట ఉంటే.. తతిమ్మ వ్యవహారాలకు కేంద్ర బిందువులను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే.. రాష్ట్రమంతా సమతుల్య అభివృద్ధి ఉంటుంది. ఈ బేసిక్ సూత్రాన్ని జయదేవ్ విస్మరిస్తున్నారు.
జయదేవ్ సిద్ధాంతమే నిజమైతే గనుక.. వాళ్ల అమరరాజా వ్యాపార సామ్రాజ్యాలను వేర్వేరు ఊళ్లలో ఎందుకు ఏర్పాటుచేస్తున్నట్టు. ఆయన గుంటూరుకు కూడా ఒక అమరరాజా ఫ్యాక్టరీ హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు దక్కడానికి అని.. ఈ ప్రశ్నకు జయదేవ్ సమాధానం చెప్పొచ్చు. రాజధాని విషయంలో మాత్రం.. ఆయన నాలుక మడతపెట్టి.. అంతా ఒకేచోట ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి అని భాష్యం చెబుతుండడమే పేచీ.