తన అవసరార్థం పచ్చి అవకాశవాదాన్ని ప్రదర్శించడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కొత్త కాదు. ఈ విషయంపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీతో, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, జనసేన.. ఇలా ఎవరితో అవసరమైతే వారితో పొత్తులతో వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు, ఎప్పటికప్పుడు తన అవకాశవాదాన్ని ప్రదర్శించడంలో అస్సలు వెనుకాడే టైపు కాదు.
అసలు చంద్రబాబు ఎప్పుడు ఎవరిని తిడతారో, ఎప్పుడు ఎవరిని నెత్తికెత్తుకుంటారో కూడా అంతుబట్టని పరిస్థితి ఆ పార్టీ కార్యకర్తల్లోనే ఉంటుంది. చంద్రబాబు మాదిరి ప్లేట్లు ఫిరాయిస్తూ, పొడిగిన వాళ్లను తిడుతూ, తిట్టిన వాళ్లను పొగుడుతూ.. పచ్చ చొక్కాలు కూడా గందరగోళ రాజకీయాన్ని కొనసాగిస్తూ సాగుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు కు కేంద్రం అవసరం ఏర్పడింది! అన్నింటికీ కేంద్రమే కావాలట.. ఆఖరికి ఆయన దీక్షకు భద్రతను కూడా కేంద్ర బలగాలే కల్పించాలట. అంతే కాదు… టీడీపీ కార్యాలయాలకు కూడా కేంద్ర బలగాలే రక్షణ కల్పించాలనేది చంద్రబాబు డిమాండ్ లలో ముఖ్యమైనవి!
అధికారంలో ఉన్నప్పుడు- బీజేపీతో పడనప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలు కానీ, సీబీఐ కానీ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడారు. కేంద్రానికి ఏపీలో చోటే లేదన్నట్టుగా వ్యవహరించారు! అప్పట్లో కేంద్రంపై చంద్రబాబు దుమ్మెత్తిపోయడం ఒక రేంజ్ లో ఉండేది!
ఏపీ భారతదేశంలో భాగం కాదు, ఏపీ అనేది తన రాజ్యం అన్నట్టుగా, తను ఏపీకి రాజును అన్నట్టుగా చంద్రబాబు నాయుడు బాహాటంగా ప్రకటనలు చేశారు. కేంద్రంపై యుద్ధంలో చంద్రబాబులో అప్పట్లో అలాంటి డెడికేషన్ ఉండేది!
మరి ఇప్పుడు.. ఆయన కేంద్రం.. కేంద్రం అంటున్నారు! అన్నింటిలోనూ కేంద్రం జోక్యం చేసుకోవాలట. తన పార్టీ ఆఫీసులకు ముందు కూడా కేంద్ర భద్రతాబలగాలే ఉండాలట! ఇలా చంద్రబాబులో కేంద్రంపై భక్తి, విశ్వాసాలు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి అవకాశవాద, అవసరార్థ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదు, బహుశా ఇవి చివరవీ కాకపోవచ్చు.
కేంద్రంలోని బీజేపీని మచ్చిక చేసుకోవడానికి.. ఇలా కేంద్రం, అమిత్ షా.. అంటూ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబుకు బాగా అలవాటైన ఈ రాజకీయాలకు బీజేపీ ఏ మేరకు మాయలో పడుతుందో!