రాజకీయంగా భ్రష్టు పట్టడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎక్కువ కాలం పట్టేలా లేదు. తన చుట్టూ ఎలాంటి వాళ్లు ఉన్నారో ఆయన మాటలే ప్రతిబింబిస్తున్నాయి. లోకేశ్ మాటలు కోటలు దాటుతాయి. చేతలు చూస్తే మాత్రం గడప కూడా దాటవు. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు చంద్రబాబు పిలుపునివ్వడం, నిర్బంధాన్ని ఎదుర్కొని టీడీపీ శ్రేణులు తమ శక్తి మేరకు పాల్గొనడం తెలిసిందే.
ఆందోళన కార్యక్రమంలో ఎక్కడా నారా లోకేశ్ పాల్గొనలేదు. కానీ మీడియా సమావేశంలో మాత్రం తాను అలా కాదు, ఇలా కాదంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడం ఆయనకే సొంతమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. లోకేశ్ ఒట్టి మాటలే తప్ప ఆయనలో అంత సీన్ లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
“రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ నేతల వీపులు పగులుతాయి. మా నాన్నలా నేను సాఫ్ట్ కాదు. ఆయన ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపిస్తారు. నేను మాత్రం కొట్టిన వాడి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రకం. శిక్ష కూడా ఊహించని రేంజ్‌లో ఉంటుంది” అని లోకేశ్ హెచ్చరించడం చర్చకు దారి తీసింది. తానేంటో చేతల్లో చూపితే జనం తెలుసుకుంటారు. అలా కాకుండా కేవలం హెచ్చరించడం ద్వారా ప్రయోజనం ఏంటి?
మొదట తనది వైఎస్ జగన్ స్థాయి అనే విషయాన్ని లోకేశ్ మరిచిపోవాలి. ఎందుకంటే తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవ లేని పరిస్థితి. ఇక పార్టీని నడిపించే సీన్ ఎక్కడ? అని ప్రత్యర్థుల ప్రశ్నలకు లోకేశ్ సమాధానం ఏంటి? కొట్టిన వాడి రెండు చెంపలు వాచిపోయేలా కొట్టే రకమని, శిక్ష కూడా ఊహించని రేంజ్‌లో ఉంటుందని లోకేశ్ హెచ్చరించడం కామెడీ అనిపించక మానదు. నిజంగా ప్రత్యర్థులకు అంత భయమే ఉంటే అసలు కొట్టే సమస్యే ఉత్పన్నం కాదు.
కొట్టిన తర్వాత రెండు చెంపలు వాయించడం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా ఈ రెండున్నరేళ్లలో తాను చేసిన ఘన కార్యాలు ఏంటో లోకేశ్ చెప్పగలరా? ఒట్టి మాటలు కట్టిపెట్టి పార్టీ శ్రేణులకు గట్టి మేలు తలపెట్టేందుకు లోకేశ్ ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే పట్టాభి స్థాయికి దిగజారి మాట్లాడ్డం వల్ల అంతిమంగా జనాల్లో పలుచన అయ్యేది తానే అని లోకేశ్ గ్రహిస్తే మంచిది.