రాజుగారి సంస్కృత పాఠం వెనుక జంధ్యాల సినిమా

ఆంధ్రలో సఖినేటిపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊరికి ఆ పేరెలా వచ్చిందంటే, శ్రీరాముడు వనవాసం సమయంలో సీతతో “సఖి! నేటికి ఈ పల్లెలో ఉందాం” అన్నాట్ట. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి ఆ…

ఆంధ్రలో సఖినేటిపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊరికి ఆ పేరెలా వచ్చిందంటే, శ్రీరాముడు వనవాసం సమయంలో సీతతో “సఖి! నేటికి ఈ పల్లెలో ఉందాం” అన్నాట్ట. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి ఆ పేరు అలా స్థిరపడిపోయిందట. 

అసలు రాముడి కాలమేంటి? ఆయన తెలుగు మాట్లాడే అవకాశం ఉందా? ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలు కూడా వేసుకోకుండా ఆ కథని సీరియస్ గా నమ్మే అమాయకులు ఉంటారు. 

ఆ మధ్యన ఒక వాట్సాప్ పోస్ట్ తెగ వైరల్ అయింది. అందులో ఉన్నదేంటంటే- “కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులు తమ అస్త్రాలని సేకరించి ఒక చోట దాచుకున్నారు. పాండవుల అస్త్రాలయమైన ఆ స్థానమే కాలక్రమంలో ఆస్ట్రేలియాగా మారింది. అఖండ భారతదేశంలో ప్రస్తుత ఆస్ట్రేలియా కూడా భాగమే”. 

అసలు భౌగోళికంగా ఏమాత్రం అవగాహన లేని నిరక్షరాస్యుడు తప్ప ఈ వెర్రికథని ప్రపంచపటం చూసిన ఆరోక్లాసు పిల్లాడు కూడా నమ్మడు. 

అయినా సరే ఇలాంటివి వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి “భూగోళమంతా మనదేనట..భూలోకవాసులంతా మనవాళ్లేట” అనుకోవడంలోనూ దానిని ప్రచారం చేయడంలోనూ ఒక “తుత్తి” ఉంటుంది. 

ఇక్కడే జంధ్యాల సినిమా నాలుగుస్థంభాలాట గుర్తొస్తుంది. 

అందులో సుత్తి వీరభద్రరావుది ఇలాంటి క్యారెక్టరే. “పైతాగరస్ ఎవరంటే ఏ జెర్మనీ వాడో రష్యావాడో అంటావ్. వాడి అసలు పేరు గిరీశుడని, కాకినాడలో మన పైతా వారబ్బాయని తెలుసా? ఊహు..తెలీదు. పొనీ ఇది తెలుసా? షేక్స్ పియర్ ఎవరు? శేషప్పయ్యర్ అని తమిళుడు మన భారతీయుడూను. న్యూటన్ ఎవడు? నూతనుడని మన బెంగాలీయుడు. మన భారతీయుడు” అంటూ వెర్రితలలేసిన భారతీయతని తన మాటలతో బయపెడుతుంటాడు. 

ఇలాంటి వెర్రి అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ మధ్యనే ఒక తమిళుడు “ద మిలనో” అనే ఇటాలియన్ లెదర్ బ్యాగుల బ్రాండ్ పేరు వాస్తవానికి “తమిళనో” అనే పదమని, వేల ఏళ్ల క్రితం తమిళులు వలస వెళ్లి స్థాపించిన నగరమే ఇటలీలోని ఇప్పటి మిలన్ అని వాదించాడు. ఎవడి వెర్రి వాడిది అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేం. 

ఇక అసలు విషయంలోకొద్దాం.  

ఈరోజు రాఘురామరాజు “భోసి డీ కే” అనే శీర్షికతో ఒక సంస్కృత పాఠం చెప్పారు. అసలిది అపవిత్రమైన బూతుమాట కాదని, పవిత్రమైన సంస్కృత వాక్యమని ప్రవచించారు. దీనికి ఆధారంగా ఎవడో రాసి నెట్లో పెట్టిన ఒక వ్యాసాన్ని చూపించారు. 

అందులో ఉన్నదేంటంటే “భో!” అంటే సంస్కృతంలో “హెలో” లాంటి సంబోధన. 

“సద్” అంటే “మంచి” 

“ఇకే” అంటే “ఉన్నది” 

అంటే “భో! సద్ ఇకే” అంటే “హెలో! మంచిగుంది” లాంటి అర్థమని ప్రతిపాదించారు. 

పైగా ఈ వాక్యాన్ని మొగలాయిలు భారతదేశాన్ని ఆక్రమించుకునే వరకు దేశంలోని అందరు ప్రజలు విరివిగా వాడేవారట. తర్వాత ఈ సంస్కృత వాక్యం నచ్చక దానికి బూతు అర్థాన్ని ఆపాదించి మొగలాయిలు భ్రష్టుపట్టించేసారట. 

అసలు మొగలాయిలు రాకముందు దేశంలో అందరూ సంస్కృతం మాట్లాడేవారనుకోవడం ఒక అవివేకం. అది పెక్కన పెడదాం. 

ఒక భాషలోని వాక్యాన్ని మరో భాషలోకి విరగ్గొట్టినప్పుడు వేరే అర్థాలు రావడం సహజం. తెలుగులో “రండి” అంటే మర్యాదపూర్వపూర్వకంగా ఆహ్వానించడానికి వాడే శబ్దం. అదే పదాన్ని హిందీలో “ముండ” అనే బూతర్థంలో వాడతారు. 
 
దేశమంతా తెలుగుమాట్లాడే రోజుల్లో “రండి” అని అందరూ ఒకళ్లనొకళ్లు పిల్చుకుంటుంటే నచ్చక హిందీ ఆక్రమణదారులు ఆ పదానికి బూతర్థం ఆపాదించి భ్రష్టుపట్టించారని అంటే ఎలా ఉంటుందో రాజుగారు చూపించిన “భొస్డీకే” కథనం కూడా అలాగే ఉంది. 

అలాగే “వెధవ” అనే తిట్టుని అది తిట్టు కాదు “వెయ్యేళ్లు ధనంతో వర్ధిల్లు” అనే దీవెనకి షార్ట్ ఫాం అని చెప్పడం కూడా దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. ఈ విషయం చెప్పి రాజు గార్ని “వెధవ” అని దీవిస్తే ఆయన ఊరుకుంటారా?  

“మీ నాన్నగారు” అన్నా “నీయమ్మ మొగుడు” అన్నా అర్థం ఒకటే. ఇక్కడ రెండోది అసభ్యమే. 

ఒక పదానికి ఎన్ని అర్థాలున్నా, ఒరిజినల్ అర్థం వేరే ఉన్నా, పదాన్ని విరగ్గొడితే మంచి అర్థం ధ్వనిస్తున్నా దానిని అధిక శాతం ప్రజలు బూతుగా పరిగణిస్తే అది బూతే. అసభ్యంగా తీర్మానిస్తే అది అసభ్యమే.

కనుక ఇక్కడ “భోస్డీకే” అంటే హిందీ బూతే. అది సంస్కృతమూ కాదు మట్టిగడ్డా కాదు. 

శ్రీనివాసమూర్తి