'ఆఖరికి ముఖ్యమంత్రిని పట్టుకుని 'వీడు..' అనేంత వరకూ వచ్చారు.. మీరు భాషను మార్చుకోండి..' అని తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సూచించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి విషయంలో చంద్రబాబు నాయుడి భాష పట్ల శ్రీకాంత్ రెడ్డి ఆక్షేపించారు. గత కొన్నాళ్లుగా జగన్ విషయంలో చంద్రబాబు నాయుడి భాష మరీ లేకిగా తయారు అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార పర్వం నుంచి అదే కథ నడుస్తూ ఉంది. 'చెడ పుట్టాడు..' అంటూ జగన్ విషయంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు.
ఇక ఎన్నికల్లో చిత్తుగా ఓడాకా చంద్రబాబు నాయుడు మరింత అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. 'జగన్ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది.. దాంతో అతడు తనను కొట్టుకుంటాడు, ఎవరినైనా కొడతాడు..' అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు భాషను మార్చుకోవాలని సూచించారు. అయితే కేవలం జగన్ విషయంలోనే కాదు, చంద్రబాబు నాయుడు తనకు నచ్చని వ్యవహారాలపై తీవ్ర మైన అసహనంతో స్పందిస్తున్నారు.
ఎన్నికల సమయంలో మోడీని ఎన్ని మాటలు అన్నారో అందరికీ తెలిసిందే. 'నేను మీ భార్య గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు..' అంటూ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో మోడీతో తనకు వ్యక్తిగత విబేధాలు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆయన. ఇక ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక పోస్టును పట్టుకుని, అందులోని పచ్చి బూతులను చదివి వినిపించి చంద్రబాబు నాయుడు జనాల్లో మరింత పలుచన అయ్యారు.
సోషల్ మీడియా అన్నాకా.. అందులో ఎంతోమంది, ఎంతో చెత్త పోస్టు చేస్తూ ఉంటారు. ఒక మాజీ సీఎం అలాంటి పోస్టు ఒకదాన్ని పట్టుకుని.. పచ్చి బూతులు చదవి వినిపించి, ఏదో మానసిక ఆనందం పొందినట్టుగా వ్యవహరించడాన్ని అనేకమంది ఆక్షేపించారు. అయినా చంద్రబాబు తీరు మారుతున్నట్టుగా లేదని విశ్లేషకులు అంటున్నారు.