ఇప్పటికే దాదాపు నెల నుంచి పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇప్పటికే అరడజనుకు పైగా కేసుల్లో చింతమనేని అరెస్ట్ అయ్యారు. మొదట కొన్నాళ్ల పాటు ఆయన పరారీ అయిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు చింతమనేనిని అరెస్టు చేశారు. ఆపై ఆయనపై పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఒక్కోదాంట్లో అరెస్టు చూపుతూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికే ఆయన మీద దాదాపు యాభై వరకూ కేసులున్నాయని అంచనా. ఆ తర్వాత అనేకమంది బాధితులు బయటకు వచ్చారు. చింతమనేనిపై కేసుల సంఖ్య సెంచరీ దిశగా సాగుతూ ఉంది. ఇప్పటికే అరవైకి పైగా కేసులున్నాయని సమాచారం.
ఇక తాజాగా మరో కేసులో చింతమనేని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఈ నెలాఖరు వరకూ చింతమనేని రిమాండ్ లో ఉండాల్సిందే అని తెలుస్తోంది. అలాగే ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. ఇన్నాళ్లూ చింతమనేనిని పోలిస్ స్టేషన్లలోనే ఉంచారు. ఇప్పుడు ఆయనను జిల్లా జైలుకు తరలించారు పోలీసు అధికారులు.