జనసేనానీ, ఏంటీ గందరగోళం.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజా సమస్యలపై ఓ కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు.. దానికి పక్కాగా ప్రణాళిక రచించుకోవాలి. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతమివ్వాలి. కుదిరితే ఆ రోజు, లేకపోతే మరుసటి రోజు.. అని ఓ…

ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజా సమస్యలపై ఓ కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు.. దానికి పక్కాగా ప్రణాళిక రచించుకోవాలి. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతమివ్వాలి. కుదిరితే ఆ రోజు, లేకపోతే మరుసటి రోజు.. అని ఓ నిరసన కార్యక్రమంపై గందరగోళ ప్రకటన బహుశా ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా చేసి వుండదేమో.

'ఫలానా నెల మొదటి వారంలో', లేదంటే 'ఫలానా వారం చివరి వారంలో' అని రాజకీయ పార్టీలు ముందస్తుగా ప్రకటన చేసి, ఆ తర్వాత తేదీని ఖరారు చేయడం కూడా చూస్తుంటాం. కానీ, జనసేన పార్టీ తరహాలో మూడు లేదా నాలుగు తేదీల్లో.. అని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పదుగాక చెప్పదు. పార్టీ అంతర్గత వేదికలపై ఫలానా తేదీ అయితే బావుంటుందని నిర్ణయం తీసుకుని, తుది నిర్ణయాన్ని.. ఆ తర్వాత ప్రకటన రూపంలో వెల్లడించొచ్చుగాక. కానీ, అలా చేస్తే అది జనసేన పార్టీ ఎందుకవుతుంది.?

'డేట్‌ సరిగ్గా చెప్పండి సామీ..' అంటూ జనసేన పార్టీని, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 'ఇలాంటి గందరగోళ రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.. ఇలాగైతే పార్టీ జనంలోకి వెళ్ళడం సంగతేమోగానీ, జనం ముందర పలచనైపోవడం ఖాయం..' అని జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు. ఇదిలావుంటే, విశాఖలో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టబోతుండగా.. ఎట్టకేలకు జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్పందించారు. 'మా జనసేన పార్టీ..' అంటూ మాట్లాడారు.

పార్టీ చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు వుంటుందని చెప్పారు. జనసేన పార్టీ ప్రజల కోసమే రాజకీయాలు చేస్తుందనీ సెలవిచ్చారు. 'హమ్మయ్య.. మీరు స్పందించారు.. ఇది చాలు సామీ..' అంటూ జనసైనికులు ఊపిరి పీల్చుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. రాష్ట్రంలో ఇసుక కొరత, ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికుల వెతలు.. అంటూ జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తారు.

డేట్‌ మాత్రం ఇప్పటికీ ఖరారు కాలేదు. అయితే మూడు.. లేదంటే నాలుగో తేదీన ఈ కార్యక్రమం జరుగుతుందట. ఈ గందరగోళం చాలు, జనసేన పార్టీకి రాజకీయాలపై ఎంత చిత్తశుద్ధి వుందో చెప్పడానికి.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే