ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం (అప్సా) అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. గతంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ దఫా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి పట్టు నిలుపుకున్నారు. వెంకట్రామిరెడ్డి గెలుపు ఆయన కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఊరటనిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వెంకట్రామిరెడ్డి సీఎం సొంత జిల్లా బద్వేలు నివాసి. ప్రభుత్వానికి అనుకూల నాయకుడిగా గుర్తింపు పొందారు. జగన్‌కు దగ్గరివాడనే పేరు తెచ్చుకున్నారు.
మరోవైపు ఉద్యోగుల్లో సీఎం జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వుందనే ప్రచారం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెంకట్రామిరెడ్డి విజయం తప్పకుండా ప్రభుత్వానికి గొప్ప ఊరటే. మొత్తం 1,225 ఓట్లకుగాను 1,162 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి రామకృష్ణపై 288 ఓట్ల మెజార్టీతో వెంకట్రామిరెడ్డి ఘన విజయం సాధించడం విశేషం. అలాగే వెంకట్రామిరెడ్డి ప్యానల్ 9 పోస్టుల్లో ఆరింటిని దక్కించుకుని సత్తా చాటింది.
ఒకవేళ ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఓటమిపాలై వుంటే… ఇది జగన్‌కు షాక్ అని ప్రతిపక్షాలు ఆరోపించే వారు. అలాగే ఎల్లో మీడియా జెజ్జనక తొక్కేది. వెంకట్రామిరెడ్డి ఓటమిపై ఎల్లో చానళ్లలో పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహించేవారు. వెంకట్రామిరెడ్డి ఓటమి కోసం ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రతినిధులు ఎదురు చూశారు.
బుధవారం అర్ధరాత్రికి వచ్చిన ఫలితం ఎల్లో బ్యాచ్‌కి షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత వెంకట్రామిరెడ్డిపై వుంది. తన పరువు కాపాడిన ఉద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టు తాను పనిచేయాలని వెంకట్రామిరెడ్డి గుర్తిస్తే మంచిది.