వైఎస్ ఆశ‌యం నెర‌వేర్చేందుకు జ‌గ‌న్ ముంద‌డుగు

క‌ర‌వుతో అల్లాడుతున్న ప్రాంతాన్ని స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌లు క‌న్నారు. ఇందులో భాగంగా ఆయ‌న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంక‌ల్పించారు. వైఎస్సార్ త‌క్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి ప‌నులు చేసిన…

క‌ర‌వుతో అల్లాడుతున్న ప్రాంతాన్ని స‌స్య‌శ్యామ‌లం చేయాల‌ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌లు క‌న్నారు. ఇందులో భాగంగా ఆయ‌న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంక‌ల్పించారు. వైఎస్సార్ త‌క్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి ప‌నులు చేసిన నాయ‌కుడిగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోయారు. ముఖ్యంగా త‌న జిల్లాకు సాగునీరు అందించేందుకు ఆయన అనేక ప్రాజెక్టుల నిర్మాణాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

గాలేరు-న‌గ‌రి సుజ‌ల స్ర‌వంతి ప‌థకంలో భాగంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో వామికొండ సాగ‌ర్‌, అలాగే క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌ల‌కు ఓ రూపం తీసుకొచ్చారు. ఆయ‌న ఆక‌స్మిక మృతితో ఎక్క‌డిక‌క్క‌డ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన మూడున్న‌రేళ్ల త‌ర్వాత వామికొండ‌, స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌ల‌పై జ‌గ‌న్ దృష్టి సారించ‌డం విశేషం.

వామికొండ సాగ‌ర్‌, న‌ర్రెడ్డి శివ‌రామిరెడ్డి రిజ‌ర్వాయ‌ర్ (స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌) ల‌లో మిగిలిన ప‌నులు చేయ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ ప‌నుల‌కు ఈ నెల 23న సీఎం వైఎస్ జ‌గ‌న్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ రెండు రిజ‌ర్వాయ‌ర్‌ల‌లో మిగిలిపోయిన ప‌నుల‌తో పాటు 35 వేల ఎక‌రాల‌కు నీళ్లు అందించేందుకు పిల్ల కాలువ‌ల‌ను త‌వ్వేందుకు రూ.130.19 కోట్ల‌తో టెండ‌ర్లు కూడా సిద్ధం చేశారు.

వామికొండ‌సాగ‌ర్ కెపాసిటీ 1.65 టీఎంసీలు, స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ నీటి సామ‌ర్థ్యం 3.06 టీఎంసీలు. వ‌చ్చే ఏడాది జూన్ నాటికి ప‌నులు పూర్తి చేసి తొలి విడ‌త‌గా 15 -20  వేల ఎక‌రాల‌కు నీళ్లు అందించాల‌ని ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం పెట్టుకుంది. పిల్ల‌కాలువ‌ల ప‌నులు పూర్త‌యితే వామికొండ ప‌రిధిలో ముద్దునూరు, వీర‌పునాయునిప‌ల్లె మండ‌లాల్లో 10 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంది. అలాగే స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ ప‌రిధిలో క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని 25 వేల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందుతుంది.

క‌మ‌లాపురం నుంచి జ‌గ‌న్ మేన‌మామ పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. రెండోసారి ఆయ‌న్ను ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. అత్య‌ధికంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 25 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించే స‌ర్వ‌రాయ‌సాగ‌ర్ ప‌నులు పూర్తి చేయ‌డానికి ఇప్ప‌టికైనా ఎమ్మెల్యే చొర‌వ చూప‌డం అభినంద‌నీయం. ప్ర‌భుత్వం నిర్దేశించుకున్న ప్ర‌కారం వ‌చ్చే ఏడాది జూన్ నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసుకుని, నీళ్లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటే ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఏముంటుంది? ఇప్ప‌టికైనా తండ్రి ఆశ‌యాన్ని నెర‌వేర్చే క్ర‌మంలో జ‌గ‌న్ ముంద‌డుగు వేయ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.