మొన్న చెల్లి, నేడు అన్న… బీజేపీ ఎంపీలకు చెప్పు దెబ్బల వార్నింగ్ కొనసాగుతోంది. టీబీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై బండి సంజయ్ డ్రగ్స్ విమర్శలు చేయడాన్ని కేటీఆర్ తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మంత్రిపై డ్రగ్స్ సంబంధిత ఆరోపణలు చేయడంపై స్పందించాలని కోరారు.
ఒక్కసారిగా ఆయన బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. అసలు సంబంధం లేని ఆరోపణలు ఏంటని నిలదీశారు. ప్రధాని మోదీని తాను ఇలాగే విమర్శిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాల్సింది పోయి, అర్థంపర్థం లేని బేకారు విమర్శలు చేయడం పద్ధతేనా ఆయన నిలదీశారు. డ్రగ్స్ టెస్ట్‌కు తాను సిద్ధమని, ఒకవేళ తనకు దానితో సంబంధం లేదని రిజల్ట్ వస్తే వాన్ని కొడ్తానని హెచ్చరించారు. వాడు ఏం మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. డ్రగ్స్ పరీక్షకు ఏం కావాలన్నా ఇస్తానని ఆయన అన్నారు.
రక్తం, చర్మం, తలపై వెంట్రుకలు, చివరికి కిడ్నీ కావాలన్నా ఇస్తానని, ఆయనిష్టం వచ్చిన డాక్టర్‌ను తీసుకురావాలని సవాల్ విసిరారు. కరీంనగర్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా…పడతాడా? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ చెప్పుతోనే కొడ్తానని చిన్న సవరణ చేయడం గమనార్హం. వానికేమైనా తెలివి వుందా? ఇదేం రాజకీయం? మనిషా, పశువా? అని మండిపడ్డారు.
ఇదిలా వుండగా ఇటీవల సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఇదే రీతిలో నిజామ్‌బాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై మండిపడ్డారు. తనను కించపరిచేలా మాట్లాడుతున్న అర్వింద్‌ను నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవిత అన్న కేటీఆర్ తనపై బండి సంజయ్ ఆరోపణలను గట్టిగా తిప్పి కొట్టే క్రమంలో చెప్పుతో కొడ్తాననడం సర్వత్రా చర్చనీయాంశమైంది.