“పవన్ ది జనసేన. అలీది వైసీపీ. కాబట్టి వాళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలున్నాయి. అందుకే అలీ కూతురు పెళ్లికి కూడా పవన్ వెళ్లలేదు. వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు స్నేహం లేదు” ఈమధ్య కాలంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ చాలా వినిపించాయి. మరీ ముఖ్యంగా అలీ కూతురు పెళ్లికి పవన్ వెళ్లకపోవడంపై చాలా చర్చ జరిగింది.
ఎట్టకేలకు ఈ అంశంపై అలీ స్పందించారు. తనకు, పవన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, కావాలనే కొందరు గ్యాప్ క్రియేట్ చేశారని అన్నారు. పనిలోపనిగా తన కూతురు పెళ్లికి పవన్ ఎందుకు రాలేదో కూడా వివరించారు.
“నా కూతురు పెళ్లి శుభలేఖ పట్టుకొని స్వయంగా నేనే వెళ్లి పవన్ ను ఆహ్వానించాను. నేను వస్తానని ముందే చెప్పడంతో సెట్స్ లోనే పవన్ అన్ని ఏర్పాట్లు చేశారు. నాకు ఛైర్ వేసి టీ కూడా ఇచ్చారు. పవన్ ను నేను ఆహ్వానించాను. ఇద్దరం 15 నిమిషాలు మాట్లాడుకున్నాం, జోకులేసుకున్నాం. పవన్ పెళ్లికి వస్తానన్నారు. పవన్ మేనేజర్ వచ్చి పెళ్లి వేదిక దగ్గర ముందే అన్నీ చూసుకున్నారు. పవన్ కూడా టైమ్ ఎడ్జెస్ట్ చేసుకున్నారు. కానీ ఫ్లయిట్ మిస్సయిపోయింది.”
ఇలా తన కూతురు పెళ్లికి పవన్ హాజరుకాలేకపోయారని వివరించారు అలీ. చాలామంది తను పవన్ ను అలీ ఆహ్వానించలేదని అనుకున్నారు. మరికొంతమంది అలీ ఆహ్వానించినా, పవన్ వెళ్లలేదని అనుకున్నారు. కానీ అవేవీ కాదని క్లారిటీ ఇచ్చారు అలీ.