దాదాపు ఐదేళ్ల కిందట అనూహ్యంగా తాడిపత్రి రాజకీయంలోకి ఎంటరయ్యారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అప్పటి వరకూ పెద్దారెడ్డి ద్వితీయ స్థాయి నేత మాత్రమే. ఆయన అన్న కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా సన్నిహితుడు.
అయితే ఒక దశలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవడంతో సూర్యప్రతాపరెడ్డి వైఎస్ కు కూడా దూరం అయ్యారు. 2004లో తాడిపత్రి నుంచి సూర్యప్రతాపరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతోనే అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత తాడిపత్రిలో కేతిరెడ్డి ఫ్యామిలీ రాజకీయానికి తెరపడింది.
వాస్తావానికి వాళ్ల సొంతూరు అప్పట్లో ధర్మవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది. ఆ తర్వాత అది శింగనమల నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిపోయింది. అయితే సూర్యప్రతాప రెడ్డి అప్పటికే ఒకసారి ధర్మవరం ఎమ్మెల్యేగా వ్యవహరించారు. దీంతో ఆయన తనయుడికి ధర్మవరంలో అవకాశం దక్కింది.
సూర్యప్రతాపరెడ్డి హత్య జరిగిన తర్వాత కాంగ్రెస్ పై తెలుగుదేశం నేతలు దుమ్మెత్తిపోయగా, సూర్యప్రతాప రెడ్డి భార్య, తనయుడు మాత్రం కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ అండదండలతో ధర్మవరంలో కాంగ్రెస్ కు నాయకత్వ లోటు నేపథ్యంలో కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తనయుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్కడ సెటిలయ్యాడు. 2005 నుంచి 2009 మధ్యన ఇన్ చార్జిగా అక్కడ పాగా వేశాడు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పొంది మంచిమెజారిటీతో నెగ్గాడు. అలా ఆనియోజకవర్గంలో సూర్యప్రతాపరెడ్డి తనయుడు సెటిలయ్యాడు. 2014లో ఓడినా, 2019లో నెగ్గి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు.
కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తమ్ముడు పెద్దారెడ్డి. జేసీ వర్గంతో వీళ్లకు మొదటి నుంచి పడదు. ఈ క్రమంలో గతంలో సూర్యప్రతాపరెడ్డి ఒక సారి పోటీ చేసి, జేసీకి గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు జగన్. తాడిపత్రి ఇన్ చార్జిగా ప్రకటించారు.
ఎన్నికల సమయంలో జేసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. ఎవరు వచ్చినా తనకే టికెట్ ఇస్తానంటే గట్టిగా పని చేసుకుంటానంటూ జగన్ ముందు కుండబద్దలు కొట్టారట పెద్దారెడ్డి. ఆ మేరకు జగన్ హామీ ఇవ్వడంతో పెద్దారెడ్డి తాడిపత్రి రాజకీయ రంగంలోకి దిగారు.
స్థానికంగా పాత పరిచయాలు ఉపయోగపడ్డాయి. వైసీపీ క్యాడర్ ను కలుపుకుపోయారు పెద్దారెడ్డి. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న జేసీ సోదరులతో పెద్దారెడ్డికి ముప్పుతిప్పలు తప్పలేదు. వీళ్లతో ఢీ అన్నందుకు గానూ.. అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రెటీ కేసులు పెట్టించారు, అరెస్టుల చేయించారు. పెద్దారెడ్డిని నెలల తరబడి జైల్లో పెట్టించగలిగారు జేసీ సోదరులు. అది కూడా చిన్న చిన్న కేసుల్లో! ఇలా వైసీపీ ఇన్ చార్జిగా పెద్దారెడ్డి చాలా కష్టాలనే పడాల్సి వచ్చింది. అందుకు ఫలితం దక్కింది. జేసీ కుటుంబాన్ని ఓడించి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా నిలదొక్కుకున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత మరింతగా చొచ్చుకుపోతూ కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తున్నారు.
ఇలాంటి క్రమంలో తను ప్రత్యక్షంగా ప్రతీకార చర్యలకు దిగలేదు పెద్దారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు జేసీల హవా సాగింది. ఆ హవాకు అయితే తెర వేయగలిగాడు. ఇంతలో ట్రావెల్స్ బస్సుల అక్రమాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అరెస్టయ్యారు. దాదాపు రెండు నెలల పాటు వాళ్లు జైల్లో గడిపారు. ప్రస్తుతానికి బెయిల్ మీద అయితే విడుదల అయ్యారు. ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషాన్ని ఇచ్చే అంశం కావొచ్చు.
తనను అకారణంగా జైల్లో పెట్టించారు జేసీ సోదరులు అనే భావన ఆయనలో ఉందనేది బయట వాళ్లకు కూడా అర్థం అయ్యే విషయమే. ప్రెటీ కేసుల్లో, సాకులు చూపి పెద్దారెడ్డిని జైల్లో పెట్టించారని, అందుకు జేసీ కుటుంబీకులు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారని పెద్దారెడ్డి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
పెద్దారెడ్డిని అకారణంగా అరెస్టు చేయించారని, ఇప్పుడు వాళ్లు మాత్రం పీకల్లోతు కేసుల్లో మునిగిపోయారని అంటున్నారు. పెద్దారెడ్డిని సిల్లీ కేసుల్లో అరెస్టు చేయిస్తే, జేసీ కుటుంబీకులు సీరియస్ కేసుల్లో జైలుకు వెళ్లారని, ఆ కేసుల్లో వాళ్లకు శిక్షలు కూడా పడే అవకాశాలుండటంతో.. ఇప్పుడు వాళ్లకు తగిన గుణపాఠం ఎదురవుతోందని పెద్దారెడ్డి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.