తెలుగుదేశం నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. బెయిల్ మీద అలా విడుదల అయిన ఆయన ఇప్పుడు మరోసారి అరెస్టయ్యారు. దురుసు ప్రవర్తన, కరోనా లాక్ డౌన్ పరిస్థితులను ఉల్లంఘించడం వంటి నేరాల కింద ఆయనను అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు అరెస్టు చేసినట్టుగా సమాచారం. ఒక పోలీసును తీవ్రంగా దూషించడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. పెద్దగా లేట్ లేకుండా పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు.
ట్రావెల్ బస్సుల అక్రమాల కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో ఆయనపై మూడు కేసుల వరకూ నమోదైనట్టుగా ఉన్నాయి. దాదాపు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చిన ఉత్సాహంలో, జైలు నుంచి విడుదల అయిన తర్వాత జేసీ అనుచర వర్గం ఆయనకు భారీ వెల్కమ్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత నిబంధలను వారు తుంగలోకి తొక్కినట్టుగా ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ విషయంలో అభ్యంతరం చెప్పిన ఒక పోలీసాఫీసర్ పట్ల ప్రభాకర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారు. ఇష్టానుసారం దూషించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు మళ్లీ కేసులు నమోదు చేశారు. మళ్లీ అరెస్టు చేసి గుత్తి కోర్టులో హాజరు పరుస్తున్నారు.
చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదేమో! రెండు నెలల పాటు జైల్లో ఉండి వచ్చినా, ప్రభాకర్ రెడ్డి తీరు మాత్రం మారినట్టుగా లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల పట్ల ఎలా స్పందించే వారో ఇప్పుడు కూడా మళ్లీ అలాగే ప్రవర్తించి ఆయన మళ్లీ బుక్ అయినట్టున్నారు.