కరోనా టైమ్ లో ఎవరు బాగుపడుతున్నారు అంటే, ప్రయివేటు ల్యాబ్ లు, ప్రయివేటు ఆసుపత్రులు. ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించినా వీరి దోపిడీ సాగిపోతూనే వుంది. జనాల బలహీనత, అవసరం ఆధారంగా ఈ దోపిడి సాగుతోంది. కరోనా రక్షణ పేరిట రకరకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పిపిఇ కిట్ లు కచ్చితంగా తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు లాగేస్తున్నారు. నిజానికి బయట ఈ కిట్ లు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి.
బంజారాహిల్స్ లోని ఓ హై ఫై ల్యాబ్ కేవలం మూడు నిమషాలు సిటి స్కాన్ టేబుల్ పై వుండేందుకు వెయ్యి రూపాయల పిపిఇ కిట్ ను అంటకడుతోంది. ఇలా అంటకడుతోంది అన్న మాట ఎందుకు వాడాల్సి వస్తోంది అంటే, ల్యాబ్ లో పరిక్షలు చేయించుకోవడానికి అనేక తరహాల జనాలు వస్తారు. అందువల్ల పిపిఇ కిట్ ను వాడడం అవసరమే. అయితే ల్యాబ్ లో తమ వంతు వచ్చేవరకు, ఆ పైన రిజల్ట్ తీసుకునేవరకు గంటలకు గంటలు పిపిఇ కిట్ లేకుండానే కూర్చో పెడుతున్నారు. పైగా స్టాఫ్ మాత్రం పిపిఇ కిట్ లు ధరించకుండానే వుంటారు.
కానీ మూడు నిమషాలు సిటి స్కాన్ టేబుల్ వున్పపుడు మాత్రమే ధరించేందుకు వెయ్యి వసూలు చేస్తున్నారు. దీనికి బదులు ఓ డిస్పోజబుల్ షీట్ ను ప్రతి పేషెంట్ కు ఒకటి వంతున సిటి స్కాన్ టేబుల్ పై పరిస్తే వంద రూపాయలతో పోతుంది.
కానీ అలా చేస్తే ల్యాబ్ లు అదనపు లాభం ఎక్కడి నుంచి వస్తుంది? రెండు మూడు వందల రూపాయల పిపిఇ కిట్ ను వెయ్యి రూపాయల వంతున రోజుకు కనీసం యాభై నుంచి వంద మందికి అమ్మితే లాభమే లాభం. ఎవరన్నా ఎదురు ప్రశ్నిస్తే, ఇంకో దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకోమంటారు. అక్కడా అదే తరహా తంతు నడుస్తుంది. కరోనా కాదు, మరే ప్రళయం వచ్చినా ఈ దేశంలో వైద్యం పేరిట దోపిడి సాగుతూనే వుంటుంది.