బుల్లితెర, వెండితెర…అని కాదు, ఆమె ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఆమె నోటి నుంచి మాటలు డెలవరీ అయితే…అదొక ప్రవాహమే. అభినయం, మాటల చతురతతో యాంకర్‌గా, నటిగా తనకంటూ తెలుగు సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఝాన్సీ. ఆలీతో సరదాగా కార్యక్రమంలో సింగర్ సునీతతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సునీత, ఝాన్సీ సరదా సరదాగా సమాధానాలిచ్చారు. వారిద్దరి ప్రత్యేకత ఏంటంటే సీరియస్ ప్రశ్నలను కూడా లైట్ తీసుకుని తామెంత ధీర వనితలో నిరూపించుకున్నారు. ముఖ్యంగా యాంకర్ ఝాన్సీ చెప్పిన ఒకట్రెండు విషయాల గురించి తెలుసుకుందాం.
నిజానికి ఝాన్సీ అసలు పేరు ఝాన్సీ లక్ష్మీ. కానీ ఆమె అందరికీ ఝాన్సీగా పరిచయం. ఇదే విషయాన్ని ఆలీ సందర్భోచితంగా అడిగారు. ఝాన్సీ లక్ష్మీ పేరు ఎవరు పెట్టారనే ప్రశ్నకు ఝాన్సీ స్పందిస్తూ తన ఇంట్లో వాళ్లు పెట్టారన్నారు. కానీ ఇప్పుడు తన పేరులో లక్ష్మీ లేదని చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఝాన్సీ ఒంటరైందన్న మాట.
ఇక సింగర్ సునీతతో ఎప్పుడు పరిచయం అయ్యిందనే ప్రశ్నకు ఝాన్సీ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. శాటిలైట్ చానళ్లు ప్రారంభమైన తర్వాత ఎలాంటి షోలు అయినా…సారథి, భాగ్యనగర స్టూడియోల్లో మాత్రమే జరిగేవన్నారు. పనితో సంబంధం లేకుండా స్టూడియోల చుట్టూ తిరుగుతుండే వాళ్లమని తెలిపారు. ఆ సమయంలో సునీత నవరాగం చేస్తుంటే, తాను ప్రేక్షకుల్లో కూర్చునేదాన్నని చెప్పారు. అలాగే తాను క్విజ్ చేస్తే…సునీత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేదని తమ ఇద్దరి మధ్య అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
ఏం చదివావనే ప్రశ్నకు ఝాన్సీ భలే గమ్మత్తుగా స్పందించారు. జీవితం…ప్రతి మనిషి జీవితం చదవాలని నవ్వుతూ ఝాన్సీ చెప్పడం ద్వారా ఆమెలోని హాస్యనటి బయటికొచ్చారు. తాను లా చదివినట్టు పేర్కొన్నారు. అలాగే తన అభిమాన గాయని చిన్మయి అని, మగవాళ్లలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే తన ఆత్మీయరాలైన సింగర్‌ను పక్కనే పెట్టుకుని, మరో సింగర్ పేరు చెప్పడం ఆశ్చర్యపరిచింది.
ఇక ప్రస్తుతం తాను ఏం చేస్తున్నదో కూడా వివరించారామె. ‘పెద్దలకు మాత్రమే’ అనే ప్రాజెక్టు ఒకటి చేస్తున్నట్టు ఝాన్సీ చెప్పారు. అయితే తాను చేసే ప్రాజెక్టు అందరూ అనుకునేది కాదని వివరణ ఇచ్చారు. టీవీ, వెబ్ సిరీస్‌లు వచ్చాక అడల్ట్ కంటెంట్ అనగానే ‘శరీరం, హింస, క్రైమ్, సెక్స్’ ఇలాగే ఆలోచిస్తున్నారన్నారు.
కానీ వాటికి మించి మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెద్దవాళ్లమైపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయాలపై చర్చించాలనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్ట్ చేపట్టినట్టు ఝాన్సీ వివరించారు. ఝాన్సీ చెప్పిందాంట్లో నిగూఢమైన అర్థం దాగి ఉంది. నిజానికి ఆమె ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా లోతైంది, విస్తృతమైంది కూడా. ఝాన్సీ ప్రకటన తర్వాత…అది ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.