అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ ని పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు చంద్రబాబు. డీజీపీ దగ్గర్నుంచి తమకు కావాల్సిన స్థానాల్లో తమవారినే నియమించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎన్ని 'కమ్మ'ని బదిలీలు జరిగాయో అందరికీ తెలుసు. అప్పట్లో ఈసీ దగ్గర జగన్ ఫైట్ చేసినా కూడా కంటితుడుపుగా కొంతమందిని మార్చారంతే. అప్పుడలా పోలీస్ డిపార్ట్ మెంట్ ని వాడుకున్న చంద్రబాబుకి ఇప్పుడు వారంతా బద్ద శత్రువులయ్యారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి, ఎవరికి వారు ఎవరి ఒత్తిడీ లేకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశారంటే పోలీస్ డిపార్ట్ మెంట్ పనితీరు అర్థమవుతోంది. అయినా కూడా చంద్రబాబు మాత్రం, పోలీసులు జగన్ చెప్పుచేతల్లోనే ఉన్నారని అన్నారు. ఆమధ్య చలో ఆత్మకూరు ఆందోళనల్లో టీడీపీ నేతలు పోలీసులను ఎన్ని మాటలన్నారో వీడియో సాక్ష్యాలున్నాయి.
ఇటీవల విశాఖ జిల్లా పర్యటనలో పోలీసులు అధికార పార్టీ తొత్తులంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు విమర్శలకు దారితీశాయి. దీంతో నెల్లూరు సభలో మాత్రం చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు. కొంతమంది, కొంతమంది పోలీసులంటూ ఒత్తి మరీ చెప్పారు. తమవారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకూ ఎవ్వర్నీ వదిలిపెట్టనంటూ భారీ డైలాగులు పేల్చారు.
నిజాయితీపరులమైన మమ్మల్ని తాకితే కరెంట్ షాకేనంటూ శాపనార్థాలు పెట్టారు బాబు. మొత్తమ్మీద పోలీసుల్ని విమర్శిస్తూ, పోలీసుల్ని చులకనగా చూస్తూ అధినేతతో సహా టీడీపీ నేతలు చెడ్డపేరు తెచ్చుకున్నారు. టీడీపీ ఆగడాలన్నీ సోషల్ మీడియాలో బైటపడటంతో.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు బాబు. నోరు కంట్రోల్ లో పెట్టుకున్నారు.