మరికొన్ని గంటల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. పలు కీలకమైన అంశాలపై స్పష్టత రాబోతోంది. అయితే మెయిన్ అజెండా మాత్రం ఒకేఒక్కటి. అదే తెలంగాణ కొత్త సెక్రటేరియట్. గడిచిన 2 వారాలుగా ఇదే పని మీద ఉన్న సీఎం కేసీఆర్.. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో తన ఆలోచనల్ని మంత్రుల ముందు పెట్టి, లాంఛనంగా ఆమోదముద్ర వేయించుకోబోతున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త పరిపాలన భవన నిర్మాణ కర్తగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఆకాంక్షతో ఉన్నారు కేసీఆర్. అందుకు తగ్గట్టే చాలా రోజులుగా పనులు జరిపించుకుంటూ వస్తున్నారు. ఇక పాత సెక్రటేరియట్ ను కూల్చేసిన తర్వాత పూర్తిస్థాయిలో కొత్త సచివాలయ నిర్మాణ పనులపై పడ్డారు. మరీ ముఖ్యంగా వాస్తుపై ఆయన ఎక్కువగా దృష్టిపెట్టారు.
దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో, సకల సదుపాయాలతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులంతా ఒకే భవనంలోకి రావాలనే ఆలోచనతో కొత్త సెక్రటేరియట్ కు డిజైన్ చేశారు. చెన్నైకి చెందిన సంస్థ రూపొందించిన డిజైన్ కు గడిచిన 2 వారాలుగా మార్పుచేర్పులు సూచించిన కేసీఆర్.. ఈరోజు ఆ డిజైన్ తో పాటు, బడ్జెట్ తదితర అంశాల్ని కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు.
కొత్త సెక్రటేరియట్ కు ఆమోదముద్రతో పాటు.. మరికొన్ని ఇతర అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. పాఠశాల విద్య-ఆన్ లైన్ క్లాసులు, కరోనా నియంత్రణ చర్యలు-ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు లాంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.