రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, ఇందుకోసం సీఆర్‌డీఏతో పకడ్బందీ ఒప్పందం చేసుకున్నారని, ఒకవేళ రాజధాని తరలించాలంటే దాదాపు లక్ష కోట్లను రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని కొంత మంది గత కొన్ని నెలలుగా చేస్తున్న వాదన. కావున ఇంత భారీ మొత్తంలో రాజధాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అవకాశం ఎంత మాత్రం లేదని, కావున ఎట్టి పరిస్థితుల్లో రాజధాని తరలిపోయే అవకాశం లేదని వారు బలంగా చేస్తున్న వాదన.
అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా రాజ్యాంగంలో 1972 యాక్ట్ ఒకటి ఉంది. ఒప్పందాలకు సంబంధించి సమగ్ర వివరాలతో పొందుపరిచిన ఈ యాక్ట్ ఇప్పుడు సీఆర్‌డీఏ రద్దు బిల్లులో క్రియాశీలకం కానుంది. కొంతమంది న్యాయనిపుణులు చెబుతున్నట్టు సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు అమరావతి రైతులతో ఒప్పంద ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనేది 1972 యాక్ట్ తేల్చి చెబుతుంది.
అమరావతి పరిసరాలను రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఎంపిక చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజధానికి భూములిచ్చిన రైతులంతా ఒకే రకమైన ఒప్పందాన్ని సీఆర్‌డీఏ చేసుకోలేదన్నది వాస్తవం. ఇందులో కూడా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా సాగింది. రాజధాని రైతులతో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారే తప్ప….చంద్రబాబుతో కాదని వాదనకు వినుసొంపుగా ఉన్నా…ప్రాక్టికల్‌గా అవినీతి, అక్రమాల కంపు కొడుతుందన్న బలమైన విమర్శలు లేకపోలేదు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని, అప్పుడు భూములకు విలువ పెరిగి ఆదాయం వస్తుందని నమ్మబలకడం వల్లే తాము మూడు పంటలు పండే పొలాలను చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చామని అమరావతి రైతులు చేస్తున్న వాదన. అందువల్లే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏ విధంగా అయితే డెవలపర్స్‌కు ఇస్తే…కొంత భూమి ఓనర్లకు ఇస్తారో, అలాంటి ఒప్పందమే సీఆర్‌డీఏ, రాజధాని రైతుల మధ్య జరిగింది.
కానీ 1972 యాక్ట్ ఏం చెబుతున్నదంటే… కాంట్రాక్ట్ ఒప్పందం న్యాయ బద్ధంగా ఉండాలి. అలాగే ప్రజల విస్తృత ప్రయోజనాలకు లోబడి ఉండాలి. దీన్నిబట్టి న్యాయపరమైన నష్టపరిహారానికి మాత్రమే రాజధాని రైతులు అర్హులు. తన సామాజిక వర్గమనో, మరో కారణం వల్లో చంద్రబాబు అధికారం తన చేతుల్లో ఉంది కదా అని….కొంత మంది రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలని రైతులతో ఒప్పందం చేసుకుని ఉంటే మాత్రం చట్టానికి నిలబడదు. అది ముమ్మాటికీ చట్ట ఉల్లంఘనే అవుతుంది.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి రాజ్యాంగం సార్వభూమాధికారాన్ని కట్టబెట్టింది. దీన్ని కాదనే హక్కు, అధికారం మరో రాజ్యాంగ వ్యవస్థకు ఉండదు. అందుకే సీఎం మొదలుకుని మంత్రుల వరకు ప్రమాణ స్వీకారాన్ని భారత రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఈ ప్రాతిపదికన చట్టాలు చేసే అధికారం ప్రజల ద్వారా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఇందుకు జగన్ సర్కార్ అతీతం కాదు. అందుకే మూడు రాజధానుల వ్యవహారంలో 1972 యాక్ట్ ఎంతో కీలకమని చెప్పొచ్చు.