రాజధాని విషయంలో వికేంద్రీకరణకే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి జగన్ కు అడ్డంకులు తప్పేలా లేవు. ఇవి ముందుగా అంచనా వేసినవే. రాజధాని అమరావతిలోనే వుండాలని కోరుకుంటున్నవారు ఎలాగూ కోర్టుకు వెళ్తారు. కోర్టులు ఎలాగూ పద్దతి ప్రకారం విచారణ చేస్తాయి. అందువల్ల ఇంతో అంతో ఆలస్యం తప్పదు అని అందరూ అనుకుంటూనే వున్నారు. ఆ విధంగానే కోర్టులో కేసు పడడం, కోర్టు కౌంటర్ దాఖలు చేయమని అడగడం అయిపోయింది. కౌంటర్ వేయడానికి పది రోజులు టైమ్ అడిగారు. అంతవరకు యధాతథ స్థితి కొనసాగించాలన్నారు. కొర్టు కేసులకు ఇదంతా రెగ్యులర్ ప్రోసీజర్ నే.
అయితే అసలు ఇందులో సిఎమ్ జగన్ అంతరంగం ఎలా వుంది? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? అన్నది కాస్త క్యూరియాసిటీ కలిగించే అంశం.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటు చేయడానికి జగన్ ఏమంత తొందరగా, ఆత్రుతగా లేరని తెలుస్తోంది. ఏ అడ్డంకులు లేకుండా వుంటే వెంటనే తరలిద్దాం. లేదూ అంటే అడ్డంకులు తీరిపోయాకే తరలిద్దాం. తొందరేముంది? అనే విధంగా జగన్ తన పార్టీ సన్నిహితుల దగ్గర అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకుంటే మరో రెండేళ్ల తరువాత అయినా చేయొచ్చు అని జగన్ భావిస్తున్నట్లు బోగట్టా.
ఇదిలా వుంటే వైకాపా పార్టీ వర్గాల భావన వేరే వుంది. కోర్టులో కేసులు పెడతారని ముందుగా ఊహించినదే. అయితే ఇక్కడ రెండు పాయింట్లు. రైతులు భూములు ఇచ్చారు. దాని ప్రకారం డెవలప్ మెంట్ చేసి, ప్లాట్లు ఇవ్వాలి. ప్రభుత్వం డెవలప్ మెంట్ చేయము, ప్లాట్లు ఇవ్వము అని అనడం లేదు కదా?
లేదూ, రాజధానికి ఇచ్చిన భూములు వెనక్కు ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తారా? దానికి కూడా ప్రభుత్వం సిద్దమే. రైతుల ఆస్తులు తీసేసుకుని, డబ్బులు ఇవ్వకుండా, శిస్తు ఇవ్వకుండా, చేస్తే అన్యాయం కానీ, కౌలు ఇస్తే ఇక అన్యాయం ఏముంది? లేదూ కౌలుకు ఇవ్వడం ఇష్టం లేదు అంటే భూమి వెనక్కు తీసేసుకోవచ్చు. అన్న అభిప్రాయాన్ని వైకాపా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే వాదన ను ప్రభుత్వం కోర్టులో వినిపించే అవకాశం వుంది.
అమరావతిలో పాలనా రాజధాని అలాగే వుంటుందని, వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పే అవకాశం వుంది. వికేంద్రీకరణ వద్దు అని ఏ కోర్టూ చెప్పకపోవచ్చు. కానీ విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు న్యాయ సమ్మతమా కాదా? అన్నది తేలాల్సి వుంటుంది. నిజానికి జగన్ కనుక అసలు మూడు రాజధానులు అన్న పదం తెరపైకి తేకుండా, నచ్చిన సంస్థలు తనకు నచ్చిన చోట పెట్టుకుని వుంటే ఎక్కడా ఏ విధమైన అడ్డంకులు వచ్చి వుండేవి కాదు. అలాంటివి కోర్టుల్లో నిలవడం కూడా కష్టం.
ఇక్కడ వైకాపా అంతర్గత వర్గాలు ఇంకో సంగతి స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు మూడు రాజధానులు వద్దు అన్నారు అనుకుందాం, జగన్ హయాంలో అమరావతిని అలాగే వుంచేస్తే మాత్రం ఏం ఒరుగుతుంది? 2024 ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాలు అన్నీ వికేంద్రీకరణ కోసం జగన్ కే ఓటేస్తే పరిస్థితి ఏమిటి? అని అంటున్నాయి.
మొత్తానికి రాజధాని వికేంద్రీకరణ వ్యవహారం టైమ్ పట్టినా, జటిలంగానే వుండేలా వుంది.