దర్శకుడు మారుతి కష్టపడి కింద నుంచి పైకి వచ్చారు. అందుకే అందిన ఏ అవకాశాన్ని వదలుకోరు. ఒకేసారి పది రకాల పనులు చేస్తుంటారు. లేటెస్ట్ గా ఓ యాప్ ఐడియా కూడా చేస్తున్నారట. ఆయన ముందుగా యానిమేషన్ రంగంలో చాన్నాళ్లు పని చేసారు. మా టీవీ కోసం కొన్ని పిల్లల కథలు కూడా గతంలో చేసారు. ఇప్పుడు మళ్లీ అవి కొనసాగించబోతున్నారట.
అదే సమయంలో విదేశాల్లో వున్న తన స్నేహితుల భాగస్వామ్యంతో, పిల్లల కోసం ఓ ప్రత్యేకమైన యాప్ అందించే ప్రయత్నంలో వున్నారట. దీని కోసం విదేశాల్లో వున్న ఆయన స్నేహితుల టీమ్ కాస్త భారీగా ఇన్వెస్ట్ చేస్తూ, గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ యాప్ లో పిల్లలకు సంబంధంచిన సమస్త సమాచారం వుంటుంది. ఇది వుంది అది లేదు అని కాదు, చాలా అంటే చాలా బ్రాడ్ ఐడియాతో ఈ యాప్ ను తయారుచేస్తున్నారట. కేవలం తెలుగు పిల్లల కోసం కాదు, వరల్డ్ వైడ్ గా వున్న పిల్లలు అందరూ వాడేలా, అందరికీ బాగా పనికి వచ్చేలా వుంటందట.
అందువల్ల దీనికి భయంకరంగా కంటెంట్ కావాలి. కేవలం ఒక సెక్షన్ అని కాదు. మల్టిపుల్ సెక్షన్లు కావాలి. సో వరల్డ్ వైడ్ గా రకరకాల జనాలతో టై అప్ పెట్టుకుని, ఈ యాప్ ను అందిస్తారు. మొత్తం మీద లాక్ డౌన్ లో రెండు మూడు స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటూ, వెబ్ సిరీస్ నిర్మాణం చేపడుతూ, ఇలా రకరకాలుగా పని చేసేస్తున్నారు మారుతి.